Suriya’s ‘Veerabhadrudu’ Release: సూర్య 'వీరభద్రుడు' విడుదలకు బ్రేక్.. చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందులు!
చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందులు!
Suriya’s ‘Veerabhadrudu’ Release: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కరుప్పు'. ఈ సినిమాను తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో ఈ గురువారం (మే 14) విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, థియేటర్లలో బొమ్మ పడటానికి మరికొన్ని గంటల సమయం ఉందనగా ఈ సినిమాకు ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి నుంచి అడ్వాన్స్ బుకింగ్‌లు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కొన్ని ఆర్థిక పరమైన లావాదేవీలు ఇంకా పరిష్కారం కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఈ క్లిష్ట పరిస్థితులపై దర్శకుడు ఆర్జే బాలాజీ స్పందిస్తూ ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. "ప్రియమైన అభిమానులారా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై నా దగ్గర కూడా ఖచ్చితమైన సమాధానం లేదు. నిర్మాతలు ఈ సమస్యలను పరిష్కరించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా ప్రయాణంలో మొదటి నుంచి మాకు అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. గడిచిన 32 నెలలుగా దేవుడు మమ్మల్ని అన్ని ఆపదల నుంచి కాపాడుకుంటూ ఇక్కడి వరకు తీసుకువచ్చాడు. ఈసారి కూడా ఆ దేవుడే ఈ గండం నుంచి గట్టెక్కిస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలో సూర్య సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సూర్య ఒక మాస్ యాక్షన్ పాత్రలో అలరించనున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఆర్థిక వివాదాలు సద్దుమణిగి, త్వరలోనే సినిమా థియేటర్లలోకి రావాలని అటు చిత్ర యూనిట్, ఇటు అభిమానులు కోరుకుంటున్నారు.