Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన బాబాయ్ జనసేనాని పవన్ కల్యాణ్‌తో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వెండితెరపై పవర్ స్టార్‌గా వెలిగిపోయే పవన్ కల్యాణ్, ఇంట్లో పిల్లలతో ఎలా ఉండేవారో ఆమె గుర్తుచేసుకున్నారు.

హాలీవుడ్ సినిమాల పరిచయం ఆయనే..

చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. తమకు ప్రపంచ సినిమాను పరిచయం చేసింది బాబాయేనని సుస్మిత తెలిపారు. ది గాడ్‌ఫాదర్, స్టార్ వార్స్ వంటి క్లాసిక్ హాలీవుడ్ చిత్రాలను, అలాగే వెస్ట్రన్ మ్యూజిక్‌ను తమకు పరిచయం చేసి, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారని ఆమె వివరించారు. తమకు ఆయన కేవలం బాబాయ్ మాత్రమే కాదని, ఒక అన్నలా, స్నేహితుడిలా ఉండేవారని పేర్కొన్నారు.

రాత్రిపూట దెయ్యం కథలు..

చిన్నప్పుడు పవన్ కల్యాణ్ తమను ఎలా ఆటపట్టించేవారో చెబుతూ సుస్మిత ఒక సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. "రాత్రి వేళల్లో నన్ను, రామ్ చరణ్‌ను, ఇంట్లోని మిగతా పిల్లలందరినీ కూర్చోబెట్టి బాబాయ్ హారర్ కథలు చెప్పేవారు. నాకు ఆ కథలంటే ఇష్టం కాబట్టి వినేదాన్ని, కానీ మిగతా పిల్లలు మాత్రం భయంతో మధ్యలోనే పారిపోయేవారు" అని నవ్వుతూ చెప్పారు.

స్టైల్ ఐకాన్ మాత్రమే కాదు.. తాత్విక చింతన కూడా..

పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ఆయన ఏ వస్త్రధారణ ఎంచుకున్నా అది ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని సుస్మిత కొనియాడారు. అయితే, ఆయనలో చాలామందికి తెలియని మరో కోణం ఉందన్నారామె. ఆయనలో ఆధ్యాత్మికత, తాత్విక చింతన చాలా ఎక్కువగా ఉంటాయని, ఆ విషయాలు తమను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయని వెల్లడించారు.

ప్రస్తుతం సుస్మిత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం, కుటుంబంతో ఆయనకున్న బలమైన బంధం గురించి తెలుసుకుని మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Tags: