Telangana High Court: ఓజీ టిక్కెట్ ధరల పెంపు మెమోను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు
సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు
Telangana High Court: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ప్రీమియర్ షోలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షోలతోపాటు టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఈ రాత్రి తెలంగాణ వ్యాప్తంగా బెనిఫిట్ షోలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధం నెలకొంది. టిక్కెట్ ధరల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైనందున, చాలామంది టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందనే అయోమయంలో వారు ఉన్నారు.
హోంశాఖ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చే అధికారం హోంశాఖ స్పెషల్ సీఎస్‌కు లేదని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్‌కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందని వారు పేర్కొన్నారు. టిక్కెట్లను అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయని వాదిస్తూ, హైకోర్టు జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ప్రభుత్వ మెమోను సస్పెండ్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేశారు.