TFPC Elections: టీఎఫ్‌పీసీ ఎన్నికలు: ప్రోగ్రెసివ్ ప్యానెల్ మేనిఫెస్టో విడుదల
మేనిఫెస్టో విడుదల
TFPC Elections: టాలీవుడ్‌లో ఉత్కంఠ రేపుతున్న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల సమయం దగ్గర పడుతోంది! రేపు జరగనున్న ఈ ఎన్నికల పోరులో భాగంగా నిర్మాతల సంక్షేమమే ధ్యేయంగా బరిలోకి దిగుతున్న 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' తాజాగా తమ ఎన్నికల మేనిఫెస్టోను ఘనంగా విడుదల చేసింది. నిర్మాతల సంక్షేమం, పారదర్శకత, సమాన హక్కులు, కొత్త నిర్మాతలకు పూర్తి ప్రోత్సాహం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్యానెల్ సభ్యులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నిర్మాతల కోసం అదిరిపోయే సంక్షేమ పథకాలను ప్రకటించారు. ప్రతి అర్హత కలిగిన సభ్యుడికి రూ. 5 లక్షల క్యాష్‌లెస్ వైద్య సదుపాయం కల్పిస్తామని, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నిర్మాతలను ఆదుకునేందుకు రూ. 50 లక్షలతో ప్రత్యేక 'ఎమర్జెన్సీ ఫండ్' ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా, దాదాపు 300 మంది యాన్యువల్ మెంబర్స్‌ను వన్‌టైమ్ మినిమం ఫీజుతో రెగ్యులర్ మెంబర్స్‌గా మారుస్తామని గుడ్‌న్యూస్ చెప్పారు.
కొత్త నిర్మాతల కోసం సింగిల్ విండో హెల్ప్‌లైన్, గైడెన్స్ డెస్క్‌తో పాటు మహిళా భద్రత కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తెస్తామని ప్యానెల్ సభ్యులు తెలిపారు. చిన్న నిర్మాతలకు ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తామని, సినిమాల విడుదలకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తామని నిర్మాత రవిశంకర్ భరోసానిచ్చారు. పారదర్శకత, నిజాయితీ, నమ్మకం, సమాన హక్కులే తమ ప్యానెల్ గెలుపు సూత్రాలని నిర్మాత అశోక్ కుమార్ పేర్కొన్నారు.
నిర్మాతలందరికీ సమాన ప్రాధాన్యత కల్పించి, కౌన్సిల్‌లో పారదర్శక పాలనను అందించడమే తమ ధ్యేయమని ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు పునరుద్ఘాటించారు. మరి ఈ మేనిఫెస్టో నిర్మాతల ఓట్లను ఏమేరకు రాల్చుతుందో, రేపు జరిగే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి!