Aishwarya Lekshmi: దుస్తుల్లో కాదు.. చూసే కళ్లలోనే లోపం ఉంది.. ట్రోలర్లపై ఐశ్వర్య లక్ష్మి ఫైర్
ఐశ్వర్య లక్ష్మి ఫైర్
Aishwarya Lekshmi: మహిళల దుస్తులపై తీర్పులిచ్చే సమాజ పోకడలపై, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తిరువనంతపురంలో జరిగిన ఒక నగల దుకాణం ప్రారంభోత్సవంలో ఆమె ధరించిన దుస్తులను లక్ష్యంగా చేసుకుని కొందరు అసభ్యకర విమర్శలు చేయగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వీటికి ధీటైన సమాధానమిచ్చారు.
అసలేం జరిగింది?
ఆ కార్యక్రమంలో కొంతమంది ఫొటోగ్రాఫర్లు కావాలనే తన ముఖాన్ని కాకుండా అసభ్యకరమైన కోణాల్లో ఫొటోలు తీసేందుకు యత్నించారని ఐశ్వర్య కుండబద్దలు కొట్టారు. ఆ పరిస్థితుల్లో ఏర్పడిన అసౌకర్యం వల్లే తన బాడీ లాంగ్వేజ్‌లో మార్పు వచ్చిందని, అంతేతప్ప తాను వేసుకున్న దుస్తుల్లో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. "ఇబ్బందిగా ఉంటే అలాంటి బట్టలు ఎందుకు వేసుకోవడం?" అంటూ విక్టిమ్ షేమింగ్‌కు పాల్పడే వారి సంకుచిత మనస్తత్వాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
సంస్కృతి అంటే దుస్తులు మాత్రమేనా?
ఈ సందర్భంగా సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను ఆమె నిలదీశారు. సంస్కృతి, సంప్రదాయాలు అనేవి కేవలం స్త్రీలు ధరించే బట్టల్లోనే కాకుండా ఎదుటివారితో ప్రవర్తించే విధానంలో కూడా ఉంటాయన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశ ఆర్థికాభివృద్ధి, వృద్ధుల సంక్షేమం లాంటి కీలక సామాజిక సమస్యలను పట్టించుకోని జనం.. ఒక మహిళ ఏ దుస్తులు వేసుకుందనే విషయంపై చర్చించడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని మండిపడ్డారు. ఎదుటివారిపై నిందలు వేయడం ఆపి, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను, నిర్ణయాలను గౌరవించడం నేర్చుకోవాలని ట్రోలర్లకు ఆమె హితవు పలికారు.