RGV: టాలీవుడ్‌లో ఉన్నవాళ్లు నిర్మాతలు కాదు.. కేవలం ఇన్వెస్టర్లు: ఆర్జీవీ
ఆర్జీవీ
RGV: టాలీవుడ్‌లో పెరుగుతున్న భారీ బడ్జెట్లు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులు,సినిమాల వైఫల్యాలపై ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ఓ ఇంటర్వ్యూలో ఆయన టాలీవుడ్ పనితీరుపై కుండబద్దలు కొట్టి మాట్లాడారు.
ఆర్జీవీ ఏమన్నారంటే.. తెలుగు సినీ పరిశ్రమలో అసలు సమస్య కథల్లో కాదని, నిర్మాతల అవగాహన లోపంలో, దర్శకుల బాధ్యత లేకపోవడంలో ఉందని వర్మ స్పష్టం చేశారు. చాలా మందికి అసలు బడ్జెట్ అంటే ఏమిటో, దర్శకుడు ఎన్ని షాట్లు ప్లాన్ చేస్తున్నాడో కూడా పూర్తి అవగాహన ఉండదని, అందుకే ఇక్కడ ఉన్నవాళ్లను నిర్మాతలు అనడం కంటే కేవలం 'ఇన్వెస్టర్లు' అనడమే కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు.
సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ప్లాన్ మారిపోవడం, బడ్జెట్ అదుపు తప్పుతున్నా ప్రశ్నించే వారు లేకపోవడం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని తెలిపారు. హిట్ సినిమా వచ్చినా నిర్మాతకు పెద్దగా లాభం మిగలకపోవడానికి కారణం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న నిర్మాణ ఖర్చేనని పేర్కొన్నారు. బడ్జెట్ పెరిగితే దాని పూర్తి బాధ్యత దర్శకుడిదేనని, డబ్బు ఎలా ఖర్చు చేయాలనేది నిర్ణయించేది డైరెక్టరే కాబట్టి అతనిపై బాధ్యత మోపాలని వర్మ తేల్చిచెప్పారు.