Seerat Kapoor: ఆ రూమర్లలో ఎలాంటి నిజం లేదు.. బిగ్‌బాస్ షోపై సీరత్ కపూర్!
బిగ్‌బాస్ షోపై సీరత్ కపూర్!
Seerat Kapoor: బిగ్‌బాస్ తెలుగు 10 రియాల్టీ షోలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను ప్రముఖ నటి సీరత్ కపూర్ ఖండించారు. నాగార్జున హోస్ట్ చేయనున్న ఈ షోలోకి సీరత్ కపూర్ ఎంట్రీ ఇస్తారంటూ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సినిమాల కంటే తన బోల్డ్ అండ్ డ్యూయల్ ఫోటోషూట్లతో నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అయ్యే ఈ భామ, బిగ్‌బాస్‌లోకి రాబోతున్నట్లు వచ్చిన రూమర్లపై తాజాగా స్పష్టతనిచ్చారు.
తాను త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు 10 షోలో అస్సలు పాల్గొనడం లేదని సీరత్ కపూర్ స్పష్టం చేశారు. ఈ ప్రచారంపై ఆమె స్పందిస్తూ, "బిగ్‌బాస్ తెలుగులో నా భాగస్వామ్యం గురించి వస్తున్న ఊహాగానాలు చూస్తున్నాను. ఈ వార్తలపై క్లారిటీ ఇస్తున్నాను, నేను ప్రస్తుతం బిగ్‌బాస్ షో చేయడం లేదు" అని తెలిపారు.
అలాగే తన కెరీర్‌కు సంబంధించి కొత్త విషయాలు ఏవైనా ఉంటే, వాటిని తాను స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటానని సీరత్ చెప్పారు. "నా జీవితంలో లేదా కెరీర్‌లో పంచుకోవాల్సిన విషయాలు ఏవైనా ఉంటే, వాటి గురించి నా సోషల్ మీడియా ఖాతాల ద్వారా నేరుగా మీతో మాట్లాడి ప్రకటిస్తాను" అని ఆమె పేర్కొన్నారు.
కాగా, బిగ్‌బాస్ తెలుగు 10 షో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీరత్ కపూర్ తాను ఈ షోలో ఉండనని స్పష్టం చేసి అన్ని రూమర్లకు చెక్ పెట్టారు.