Radhika Apte’s Shocking Remarks: అవి ఇప్పటికీ భయపెడుతున్నాయి.. సినీ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
Radhika Apte’s Shocking Remarks: చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే, తాజాగా తన 20 ఏళ్ల సినీ ప్రస్థానంలోని చీకటి కోణాలను బయటపెట్టారు. ముఖ్యంగా దక్షిణాది సినిమాల్లో నటించిన సమయంలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల వల్లే గతంలో కొన్ని సౌత్ సినిమాలకు సంతకం చేయాల్సి వచ్చిందని రాధికా ఆప్టే కుండబద్దలు కొట్టారు. ఆ సెట్స్‌లో వాతావరణం తనకు ఏమాత్రం సౌకర్యంగా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
సెట్స్‌లో ఒంటరితనం.. అసభ్యకర జోకులు:
షూటింగ్ సమయాల్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ రాధికా ఇలా చెప్పుకొచ్చారు.. మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరిగేటప్పుడు సెట్‌లో ఉన్న ఏకైక మహిళను తనేనని, తన వ్యక్తిగత సిబ్బందిని కూడా లోపలికి అనుమతించేవారు కాదని ఆమె తెలిపారు. సెట్‌లో ఉన్న వ్యక్తులు మహిళల గురించి అసభ్యకరమైన జోకులు వేసేవారని, అది తనను తీవ్ర అసౌకర్యానికి గురిచేసేదని తెలిపారు. "నేను సాధారణంగా చాలా ధైర్యవంతురాలిని, కానీ ఆ రోజుల గురించి తలచుకుంటే ఇప్పటికీ నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏ నటికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు" అని ఆమె ఆవేదన చెందారు.
బాలీవుడ్‌లోనూ పెద్దల వేధింపులు
కేవలం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని రాధికా వెల్లడించారు. అవకాశాల కోసం కొందరు పెద్ద మనుషులని కలిశానని, వారి ప్రవర్తన చూశాక జీవితంలో మళ్లీ వారిని కలవకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వారి పేర్లు చెబితే ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతుందని ఆమె హింట్ ఇచ్చారు.
రాధికా ఆప్టే ప్రయాణం:
2005లో హిందీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన రాధికా తెలుగులో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, బాలీవుడ్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో బిజీగా ఉన్నారు. గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న ఇలాంటి వాస్తవాలు రాధికా ఆప్టే వ్యాఖ్యలతో మరోసారి చర్చకు దారితీశాయి.