Akhil Opens Up: ఏజెంట్ తర్వాత మూడేళ్ల గ్యాప్.. బాత్రూంలో ఆ ప్రమాదం వల్లే.. అఖిల్ ఎమోషనల్ కామెంట్స్..

అఖిల్ ఎమోషనల్ కామెంట్స్..

Update: 2026-07-02 15:08 GMT

Akhil Opens Up: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ లెనిన్ విడుదలకు సిద్ధమైంది. మురళీకిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 10న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో పాల్గొన్న అఖిల్.. తాను ఏజెంట్ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల పాటు వెండితెరకు దూరం కావడానికి గల అసలు కారణాన్ని బయటపెట్టి అభిమానులను షాక్‌కు గురిచేశారు.

బాత్రూంలో ప్రమాదం.. 48 కుట్లు..

ఇంటర్వ్యూలో అఖిల్ తన వ్యక్తిగత గాయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఏజెంట్‌ సినిమా రిలీజైన మూడు నెలలకే నేను బాత్రూంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాను. అక్కడ ఉన్న గాజు ముక్కలు నా చేతికి బలంగా గుచ్చుకోవడంతో తీవ్ర గాయమైంది. ఎడమ చేతి వేళ్లకు రెండు సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఏకంగా 48 కుట్లు పడ్డాయి. దాదాపు 8 నెలల పాటు కనీసం బరువులు కూడా ఎత్తలేని పరిస్థితి. ఆ గాయం నుండి నేను పూర్తిగా కోలుకోవడానికి 16 నెలల సుదీర్ఘ సమయం పట్టింది’’ అని వివరించారు. లాంగ్ గ్యాప్ రావడం వల్ల తన అభిమానులు తనపై కోపంగా ఉన్నారని, అయితే భవిష్యత్తులో ఇలాంటి విరామం మళ్లీ రాదని అఖిల్ ఈ సందర్భంగా ప్రామిస్ చేశారు.

ఇలాంటి కథ ఇండియన్ స్క్రీన్‌పై రాలేదు..

తన కమ్‌బ్యాక్ మూవీగా లెనిన్‌ను ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాన్ని అఖిల్ పంచుకున్నారు. ‘‘మురళీకిశోర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు ఒక సరికొత్త అనుభూతి కలిగింది. ఇందులోని క్యారెక్టరైజేషన్స్ నన్ను ఆశ్చర్యపరిచాయి. అసలు ఈ పాయింట్ మీద ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఒక్క చిత్రం కూడా రాలేదు. అందుకే నా కమ్‌బ్యాక్‌కు ఇదే సరైన సినిమా అని ఫిక్స్ అయ్యాను’’ అని అఖిల్ ధీమా వ్యక్తం చేశారు.

ఆమె కోసమే లెనిన్ ఏం చేసినా..

ఈ సినిమాలో అఖిల్ సరసన టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఈ చిత్రంలో భారతి అనే ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. తన క్యారెక్టర్ గురించి భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ‘‘ఇందులో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. సినిమాలో హీరో లెనిన్ ఏం చేసినా అది భారతి కోసమే చేస్తాడు. నటీనటుల ప్రతిభను నిరూపించుకోవడానికి ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా దొరుకుతాయి. నా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి గొప్ప అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొంది.

Tags:    

Similar News