Thug Life: థగ్‌‌లైఫ్‌‌.. హైకోర్టుకు కమల్ హాసన్

Update: 2025-06-03 03:57 GMT

Thug Life: కమల్ హాసన్ లీడ్ రోల్‌‌లో మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్‌‌’ చిత్రం నుంచి సోమవారం ‘విశ్వదనాయక’ అనే పాటను విడుదల చేశారు. ఈనెల 5న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇదిలా ఉంటే.. ఆమధ్య ఈ మూవీ ఈవెంట్‌‌లో ‘తమిళం నుంచి కన్నడ భాష పుట్టింది’ అని కమల్ హాసన్‌‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కర్ణాటక రక్షణ వేదికతో పాటు పలు ప్రజా సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మే 30లోగా క్షమాపణలు చెప్పకపోతే సినిమాను బహిష్కరిస్తామని కర్ణాటక ఫిల్మ్‌‌ ఛాంబర్‌‌ హెచ్చరించింది. డెడ్‌‌లైన్‌‌ ముగిసినా కమల్ క్షమాపణలు చెప్పకపోవడంతో ‘థగ్‌‌లైఫ్‌‌’ చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్‌‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

దీంతో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తమ చిత్రం విడుదలను అడ్డుకోవద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలను ఆదేశించాలని పిటిషన్‌‌లో కమల్ కోరారు. క్షమాపణలు చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారు. గతంలోనూ తనపై ఇలాంటి బెదిరింపులు చాలానే వచ్చాయని, తప్పు చేయని పక్షంలో క్షమాపణలు చెప్పనని తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు.

పలువురు చరిత్రకారులు తనకు చెప్పిన విషయాన్ని ప్రస్తావించానే తప్ప తన వ్యాఖ్యల్లో మరే ఉద్దేశం లేదని, ఈ విషయాన్ని చరిత్ర కారులు, భాషా నిపుణులకు వదిలివేయాలని ఆయన చెప్పారు. అయినా ఇలాంటి వివాదాలు కమల్‌‌కు కొత్తేమీ కావు. బహిష్కరణ లాంటి పరిస్థితులను గతంలోనూ ఆయన ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడూ తలొగ్గలేదు. ఆర్థికంగా నష్టపోయినా తగ్గేదే లేదన్నారు. కొన్నిసార్లు తన సినిమాల్లోని కంటెంట్‌‌ వివాదాలకు కారణమైతే, ఇంకొన్నిసార్లు ఆయన కామెంట్స్ కాంట్రవర్సీకి దారితీశాయి. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటిపై వివరణ ఇచ్చుకోవడం తప్ప, ఏరోజూ ఆయన క్షమాపణలు చెప్పలేదు. ఇప్పుడు ‘థగ్‌‌లైఫ్‌‌’ చిత్రానికి ఆయన వన్‌‌ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినప్పటికీ తన కామెంట్స్ విషయంలో తగ్గేదే లేదంటున్నారు.

Tags:    

Similar News