Rahul Ramakrishna: చితి చివరిదాక... KCR.. నటుడు రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్.. నెట్టింట దుమారం..
నెట్టింట దుమారం..
Rahul Ramakrishna: టాలీవుడ్ విలక్షణ నటుడు, రచయిత రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక చిన్న వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై నిక్కచ్చిగా స్పందించే ఆయన, తాజాగా ఎక్స్ వేదికగా "చితి చివరిదాంక... KCR" అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యను ఆయన ఏ ఉద్దేశంతో లేదా ఏ సందర్భంలో చేశారనే దానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ మద్దతుదారులు, కేసీఆర్ అభిమానులు ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం ఆయన రాజకీయ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
రాహుల్ రామకృష్ణ ఇలాంటి రాజకీయ అంశాలపై స్పందించి వివాదాల్లో నిలవడం కొత్తేమీ కాదు. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తూ చేసిన పోస్టులతో జనసేన కార్యకర్తల నుంచి తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అలాగే గతంలోనూ తెలంగాణ రాజకీయ పరిణామాలపై కేసీఆర్, కేటీఆర్‌లను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్టులు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
అర్జున్ రెడ్డి, గీత గోవిందం, బ్రోచేవారెవరురా, జాతి రత్నాలు, ఆర్ఆర్ఆర్, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాలలో తనదైన సహజ నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన రాహుల్ రామకృష్ణ, నటుడిగానే కాకుండా రచయితగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.