Hero Prince Cecil: టాలీవుడ్ హీరో ప్రిన్స్ సిసిల్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు సాయి మాచిరాజు మెడలో మూడుముళ్లు వేసి.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. పెద్దల అంగీకారంతో ఆగస్టు 24న న్యూజిలాండ్ వేదికగా ప్రిన్స్, సాయి మాచిరాజు వివాహం ఘనంగా జరిగింది.

తమ పెళ్లికి సంబంధించిన అందమైన ఫొటోలను ప్రిన్స్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జీవితకాలపు బంధానికి స్వాగతం అంటూ లవ్ ఎమోజీలతో ఈ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ప్రిన్స్, సాయి మాచిరాజు ప్రేమకథ విషయానికి వస్తే.. ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లిలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. న్యూజిలాండ్‌కు చెందిన ఎన్నారై సాయి మాచిరాజుతో ఏర్పడిన ఈ పరిచయం.. కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న వీరు.. తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ ఏడాది జూన్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

సినిమా విషయానికి వస్తే.. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాతో ప్రిన్స్ సిసిల్ టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టారు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బస్ స్టాప్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.హీరోగా మాత్రమే కాకుండా.. సహాయ నటుడిగానూ పలు సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రిన్స్.

ఇక ఇప్పుడు సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రిన్స్, సాయి మాచిరాజు జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags: