Hero Nagarjuna Playing a Safe Game: టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున సేఫ్ గేమ్

హీరో నాగార్జున సేఫ్ గేమ్

Update: 2026-05-15 12:14 GMT

Hero Nagarjuna Playing a Safe Game: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న వివాదాల మధ్య అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా ఆయనకు కేవలం నిర్మాణ రంగంలోనే కాకుండా, పంపిణీ మరియు స్టూడియో నిర్వహణలోనూ కీలక పాత్ర ఉంది. ఆయన మేనకోడలు సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ కార్యకలాపాలను పర్యవేక్షించడమే కాకుండా, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో కీలక సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గిల్డ్ నిర్ణయాలకు మద్దతు తెలపాల్సిన బాధ్యత ఒకవైపు ఉంటే, మరోవైపు ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్‌తో నాగార్జునకు ఉన్న సుదీర్ఘ వ్యాపార అనుబంధం ఆయనను సంకట స్థితిలో పడేసింది.

ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరియు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న పోరు ముదురుతున్న తరుణంలో, నాగార్జున మరియు అన్నపూర్ణ స్టూడియోస్ ఒక సమతుల్య వైఖరిని అవలంబించాయి. ముఖ్యంగా శిరీష్ మరియు సునీల్ నారంగ్ గిల్డ్ సభ్యులపై నేరుగా విమర్శలు గుప్పించడంతో టాలీవుడ్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాల మధ్య చీలిక స్పష్టంగా కనిపిస్తున్న ఈ సమయంలో, ఏ ఒక్క పక్షానికి కొమ్ముకాయకుండా తన ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు నాగార్జున.

ఈ వివాదానికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ ఈరోజు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. తాము గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నట్లుగానే, ఇకపై కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకునే నిర్ణయాలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ఛాంబర్ అనేది అందరికీ ఉమ్మడి వేదిక కాబట్టి, దాని పేరు చెప్పడం ద్వారా అటు గిల్డ్‌ను, ఇటు ఎగ్జిబిటర్లను నొప్పించకుండా నాగార్జున చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ ప్రకటనతో ఇండస్ట్రీలోని అంతర్గత విభేదాల్లో తలదూర్చకుండా ఆయన ఒక 'సేఫ్ గేమ్' ఆడారని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News