Actor Robo Shankar: కోలీవుడ్‌లో విషాదం.. నటుడు రోబో శంకర్ కన్నుమూత
నటుడు రోబో శంకర్ కన్నుమూత
Actor Robo Shankar: తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన రోబో శంకర్ ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. గతంలో కామెర్ల వ్యాధి నుంచి కోలుకున్న శంకర్, బరువు బాగా తగ్గిపోయి అభిమానులను ఆందోళనకు గురిచేశారు. అయినప్పటికీ కుకింగ్ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. ఈసారి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
రోబో శంకర్ సినీ ప్రస్థానం
1997 నుంచి సినిమాల్లో నటిస్తున్న రోబో శంకర్, టీవీ, సినిమాల్లో తన హాస్య నటనతో గుర్తింపు పొందారు. రోబో వేషం వేయడంతో ఆయన పేరు రోబో శంకర్ గా స్థిరపడిపోయింది. కమల్ హాసన్‌కు వీరాభిమాని అయిన శంకర్, రజినీకాంత్ చిత్రం పడయప్పాలో సపోర్టింగ్ రోల్ చేసి, ఆ తర్వాత విజయ్ సేతుపతితో కలిసి నటించిన ఇంద్రకుథానే ఆసైపట్టాయ్ బాలాకుమారా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ప్రముఖ చిత్రాల్లో మారీ, సింగపూర్ సెలూన్, ‘వెలైను వంధుట్ట వెల్లకరన్, కడవుల్ ఇరుకాన్ కుమరు, పా పాండీ, వేలైక్కరన్, విశ్వాసం, ఇరుంబు థిరాయ్ వంటివి ఉన్నాయి.