Mokshagna’s Debut Film: మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ
దర్శకుడు వశిష్ఠ
Mokshagna’s Debut Film: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు దర్శకుడు ఖరారయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రానికి దర్శకత్వం వహించిన వశిష్ఠ.. మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను తెరకెక్కించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసేందుకు గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించారు. సినిమా లాంఛనంగా కూడా మొదలైంది. అయితే కొంతకాలానికే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు తన కుమారుడి హీరో ఎంట్రీ బాధ్యతలను బాలకృష్ణ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేనికి అప్పగించినట్లు తెలుస్తోంది.
మోక్షజ్ఞ కోసం వశిష్ఠ చెప్పిన కథ బాలకృష్ణకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన దర్శకత్వంలోనే తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బాలకృష్ణ, మోక్షజ్ఞను చిత్రబృందం కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా మేకర్స్ విడుదల చేశారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమా మూడేళ్లకు పైగా నిర్మాణంలో ఉండగా.. దాని విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తన తదుపరి ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను చేపట్టడం ఆసక్తికరంగా మారింది.