Prithviraj Sukumaran Makes Sensational Comments: నటి లైంగిక దాడి కేసు తీర్పు.. పృథ్వీరాజ్ సుకుమారన్ సంచలన కమెంట్స్
పృథ్వీరాజ్ సుకుమారన్ సంచలన కమెంట్స్
Prithviraj Sukumaran Makes Sensational Comments: మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ప్రముఖ నటి లైంగిక దాడి కేసులో ఎర్నాకుళం సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో కోర్టు మొత్తం ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి, వారికి 20 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాధితురాలైన నటి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, తమ బాధాకరమైన ప్రయాణంలో తాత్కాలికంగా ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. "8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధాకరమైన ప్రయాణంలో ఇప్పుడు ఉపశమనం కలిగింది" అని ఆమె పోస్ట్ చేశారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆమె పోస్ట్‌ను షేర్ చేస్తూ నమస్కారం ఎమోజీతో తన మద్దతు తెలిపారు.
పూర్తి న్యాయంపై మంజు వారియర్ అసంతృప్తి
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని నిర్దోషిగా బయటపడిన నటుడు దిలీప్‌కు మాజీ భార్య అయిన నటి మంజు వారియర్ కూడా తీర్పుపై స్పందించారు. అయితే ఆమె ఈ తీర్పుతో పూర్తి న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు.మంజు వారియర్ మాట్లాడుతూ.. "నేరం చేసిన వారికి శిక్ష పడింది. కానీ ఈ దారుణానికి ప్లాన్ చేసిన అసలు వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అది భయంకరమైన విషయం. ఈ నేరం వెనుక ఉన్న వారందరికీ శిక్ష పడినప్పుడే పూర్తి న్యాయం జరిగినట్టు అవుతుంది" అని వ్యాఖ్యానించారు.
వదంతులు, న్యాయవ్యవస్థపై నమ్మకం
ఈ సందర్భంగా బాధితురాలైన నటి.. తనపై వస్తున్న కొన్ని వదంతులకు కూడా స్పష్టత ఇచ్చారు. ప్రధాన నిందితుడు తన పర్సనల్ డ్రైవర్ కాదని, తాను పనిచేసిన ఓ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన డ్రైవర్ అని ఘటనకు ముందు అతడిని ఒకటి రెండుసార్లు మాత్రమే చూశానని తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆమె కోరారు. న్యాయ ప్రక్రియపై తనకున్న అనుభవాన్ని పంచుకుంటూ, 2020లోనే ఈ కేసులో ఏదో పొరపాటు జరుగుతోందని నాకు అనిపించింది. ట్రయల్ కోర్టుపై నమ్మకం లేదని హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా నా విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. ఈ ప్రయాణంలో చట్టం ముందు అందరూ సమానులు కారు అని అర్థమైంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె తన పోస్ట్‌ను ముగించారు.