Sundeep Kishan’s Sigma Postponed: విజయ్ రాజకీయ ప్రకంపనలు: సందీప్ కిషన్ ‘సిగ్మా’కు తప్పని వాయిదా!

సందీప్ కిషన్ ‘సిగ్మా’కు తప్పని వాయిదా!

Update: 2026-03-13 06:11 GMT

Sundeep Kishan’s Sigma Postponed: తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం తన వ్యక్తిగత మరియు రాజకీయ జీవితంలో ఎదుర్కొంటున్న వివాదాలు ఆయన కుటుంబానికి సంబంధించిన సినిమాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ హడావుడి ఒకవైపు, తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారం మరోవైపు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ గందరగోళం కారణంగా విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ ఇప్పటికే సెన్సార్ చిక్కుల్లో పడి రిలీజ్ ఆలస్యం కాగా, ఇప్పుడు ఆయన కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వ అరంగేట్రంపై కూడా దీని ప్రభావం పడింది.

విజయ్ వారసుడిగా నటనలోకి వస్తాడని అందరూ భావించినా, జాసన్ సంజయ్ మాత్రం మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. ఆయన దర్శకత్వంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ వాస్తవానికి 2025 డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, విజయ్ చుట్టూ ఉన్న వివాదాలు సద్దుమణిగే వరకు ఈ సినిమాను విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాను రిలీజ్ చేస్తే ప్రమోషన్ల కోసం జాసన్ సంజయ్ మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడు సినిమా కంటే విజయ్ రాజకీయ ఎంట్రీ, విడాకుల గురించిన ప్రశ్నలే ఎక్కువగా ఎదురవుతాయని, అది సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చిత్ర బృందం భావిస్తోంది.

దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని లైకా ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది. మనీ మరియు క్రైమ్ చుట్టూ తిరిగే ఈ ఇంట్రెస్టింగ్ హీస్ట్ థ్రిల్లర్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. సందీప్ కిషన్ లీడ్ రోల్ ప్లే చేస్తుండటంతో పాటు, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఏదేమైనా, తండ్రి రాజకీయ రంగప్రవేశం కొడుకు తొలి సినిమా విడుదలకు అడ్డంకిగా మారడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News