Niti Taylor: బాలీవుడ్ నటి నితి టేలర్ కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన సంచలన ఆరోపణలు చేశారు. తెలుగులో తణిష్ అల్లాడి హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన “మెం వయసుకు వచ్చాం” సినిమాలో నితి టేలర్ నటించారు. అలాగే రాహుల్ రవీంద్రన్ హీరోగా రామకృష్ణ మాచకంటి దర్శకత్వం వహించిన “పెళ్లి పుస్తకం” సినిమాలోనూ ఆమె కనిపించారు. “క్షేమంగా వెళ్లి లాభంగా రండి” ఫేమ్ రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన “లవ్ డాట్ కామ్” సినిమాలోనూ నితి టేలర్ నటించారు.

అయితే నితి టేలర్ నటించిన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆమెకు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు ఎక్కువగా రాలేదు. హిందీ సినిమాల్లోనూ అవకాశాలు పరిమితంగానే ఉండటంతో దాదాపు ఆరేళ్ల క్రితం నితి వివాహం చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు.

ఇప్పుడు ఓ షాకింగ్ ఆరోపణతో నితి టేలర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఓ సౌత్ ఇండియన్ దర్శకుడిపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

తాను ఓ సౌత్ ఇండియన్ సినిమాలో నటించిన తర్వాత, ఆ సినిమా దర్శకుడు తనకు ఫోన్ చేసి తన తదుపరి సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పినట్లు నితి తెలిపారు. అయితే ఆ అవకాశం ఇవ్వాలంటే తన లైంగిక కోరికలను తీర్చాలని దర్శకుడు షరతు పెట్టినట్లు ఆమె ఆరోపించారు.

ఆ ప్రతిపాదనతో తాను భయపడిపోయానని, వెంటనే ఆ దర్శకుడి నంబర్‌ను బ్లాక్ చేశానని నితి వెల్లడించారు. ఆ సమయంలో జరిగిన ఈ ఘటనను ఎవరికీ చెప్పే ధైర్యం కూడా తనకు రాలేదని ఆమె తెలిపారు.

ఈ అనుభవం కూడా తాను సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించడం ఆపేయడానికి ఒక కారణమైందని నితి పేర్కొన్నారు. అయితే తాను చేసిన ఆరోపణల్లో ఆ దర్శకుడి పేరును మాత్రం ఆమె బహిరంగంగా వెల్లడించలేదు.

అందువల్ల నితి టేలర్ ఆరోపించిన ఆ సౌత్ ఇండియన్ దర్శకుడు ఎవరు అనేది ప్రస్తుతం అధికారికంగా తెలియదు.

Tags: