Mahavatar Narasimha: వారెవ్వా.. రూ. 40 కోట్లు పెడితే రూ. 310 కోట్లు వసూలు చేసిన 'మహావతార్ నరసింహ'.
రూ. 310 కోట్లు వసూలు చేసిన 'మహావతార్ నరసింహ'.;
Mahavatar Narasimha: భారతీయ సినిమా చరిత్రలో యానిమేషన్ చిత్రాలు ఇంతటి భారీ విజయం సాధించడం చాలా అరుదు. అయితే ఈ అంచనాలను తలకిందులు చేస్తూ, 'మహావతార్ నరసింహ' అనే యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, ఐదు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 310 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
భారతీయ యానిమేషన్ చిత్రాల రికార్డు బద్దలు:
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 35 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు దేశంలోనే రూ. 238.25 కోట్ల నెట్ (రూ. 282.50 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న 'వార్ 2', 'కూలీ' వంటి పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, ఐదో వారంలో కూడా ఈ చిత్రం రూ. 18.50 కోట్లకు పైగా సంపాదించడం విశేషం. విదేశాల్లో ముఖ్యంగా ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ యానిమేషన్ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు రజినీకాంత్ నటించిన 'కొచ్చాడియాన్' పేరిట ఉండేది.
భారీ లైవ్-యాక్షన్ చిత్రాల రికార్డులు బద్దలు:
ఈ యానిమేషన్ చిత్రం కేవలం యానిమేషన్ చిత్రాల రికార్డులనే కాకుండా, కొన్ని భారీ బడ్జెట్ లైవ్-యాక్షన్ చిత్రాల జీవితకాల వసూళ్లను కూడా దాటింది. సూర్యవంశీ'(రూ. 300 కోట్లు), ది కేరళ స్టోరీ (రూ. 304 కోట్లు) వంటి హిట్ చిత్రాలను కూడా ఈ సినిమా అధిగమించింది. భారత్‌లో డిస్నీ, సోనీ, మార్వెల్ వంటి అంతర్జాతీయ సంస్థల యానిమేషన్ చిత్రాల కంటే కూడా 'మహావతార్ నరసింహ' అత్యధిక వసూళ్లు సాధించింది.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో తొలి భాగం
హోంబళే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా, విష్ణుమూర్తి దశావతారాల ఆధారంగా రాబోయే ఏడు భాగాల మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి భాగం. విష్ణుమూర్తి నరసింహావతారం, భక్తుడైన ప్రహ్లాదుడి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఈ విజయంతో ఈ సిరీస్‌లో రాబోయే చిత్రాలపై అంచనాలు భారీగా పెరిగాయి.