Yash Reveals: టాక్సిక్‌లో గ్యాంగ్‌స్టర్ కథను మహిళా కోణంలో చూపిస్తున్నాం.. రాకింగ్ స్టార్ యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాకింగ్ స్టార్ యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Yash Reveals: కన్నడ స్టార్ యశ్ కేజీఎఫ్ సిరీస్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి తాజాగా యశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన సినిమాకాన్ వేడుకలో యశ్ పాల్గొని, ఈ చిత్రం విశేషాలను పంచుకున్నారు. సాధారణంగా గ్యాంగ్‌స్టర్ డ్రామాలు అంటే పురుష దర్శకులే బాగా తెరకెక్కిస్తారనే అభిప్రాయం అందరిలో ఉంటుందని, కానీ టాక్సిక్ ఆ అభిప్రాయాన్ని మార్చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
"ఈ గ్యాంగ్‌స్టర్ కథను ఒక మహిళా కోణంలో చూపించడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. గీతూ మోహన్‌దాస్ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి" అని యశ్ కొనియాడారు. శృంగార సన్నివేశాల నుంచి మొదలుకొని, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ వరకు ప్రతి దానిలో ఆమె మార్క్ ఉంటుందని, ఒక లేడీ డైరెక్టర్ ఇంత అద్భుతంగా ఎమోషన్స్‌ను ప్రెజెంట్ చేయగలరా అని తాను ఆశ్చర్యపోయానని ఆయన పేర్కొన్నారు.
ఐదుగురు భామలతో రాకింగ్ స్టార్ సందడి
ఈ సినిమాలో యశ్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండటం మరో విశేషం. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా ఈ ప్రాజెక్ట్ చుట్టూ బలంగా వినిపిస్తున్నాయి. గీతూ మోహన్‌దాస్ గొప్ప రచయిత కావడంతో కథలో ప్రతి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
మొదట ఈ చిత్రాన్ని 2026 మార్చిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, నిర్మాణానంతర పనులు, షూటింగ్ ఆలస్యం కావడం వల్ల విడుదలను వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం, టాక్సిక్ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.