Sri Kapileswara Swamy: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాలకు జూలై 25వ తేదీ శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభించనున్నారు.

సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 26న పవిత్ర ప్రతిష్ఠ, జూలై 27న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 28న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే నిత్యార్చనలు, ఉత్సవాల్లో తెలిసీ తెలియక సంభవించే దోషాలకు ప్రాయశ్చిత్తంగా, ఆలయ పవిత్రతను పరిరక్షించే మహోన్నత సంకల్పంతో శైవాగమ శాస్త్రోక్త విధానంలో ప్రతి సంవత్సరం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.

ప్రతిరోజూ ఉదయం సుప్రభాత సేవ అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షమ్మ అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తులకు కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం వైభవంగా జరుగుతుంది.

రూ.700 టికెట్‌తో గృహస్తులు (ఇద్దరు) పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికెతో పాటు ఉత్సవాల చివరి రోజు పవిత్రమాలలను ప్రసాదంగా అందజేస్తారు. ఈ పవిత్రోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని పరమశివుని అనుగ్రహం పొందాలని టిటిడి భక్తులను కోరుతోంది.

Tags: