Things Happening in Your Home: మీ ఇంట్లో ఇవి జరుగుతున్నాయా? అయితే మీకు అదృష్టం వరించబోతున్నట్లే..
అయితే మీకు అదృష్టం వరించబోతున్నట్లే..
Things Happening in Your Home: వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రకృతి, మన చుట్టూ ఉన్న జీవరాశులు భవిష్యత్తులో జరగబోయే శుభ పరిణామాలను ముందే పసిగట్టి మనకు కొన్ని సంకేతాలను అందిస్తాయి. ఈ సంకేతాలు కనిపించినప్పుడు మన ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, ఐశ్వర్యం, మనశ్శాంతి చేకూరుతాయని నమ్మకం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆలయ గంటలు లేదా శంఖ నాదం
ఉదయాన్నే లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయలుదేరేటప్పుడు ఆలయ గంటల శబ్దం గానీ, శంఖం ఊదడం గానీ వినిపిస్తే అది దైవిక ఆశీస్సులకు చిహ్నం. వాస్తు ప్రకారం.. ఈ పవిత్ర శబ్దాలు పర్యావరణాన్ని శుద్ధి చేసి, మీ పనుల్లో విజయాన్ని సూచిస్తాయి.
ఆవు - దూడ దర్శనం
గోమాతను సాక్షాత్తూ లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం.
మీ ఇంటి ముందు ఆవు తన దూడకు పాలు ఇస్తూ కనిపిస్తే, అది అత్యంత శుభప్రదం. ఇది ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి, సంతాన సౌఖ్యానికి, కుటుంబంలో సంతోషానికి సంకేతం.
ఏం చేయాలి? ఇలాంటి సమయంలో ఆవుకు పచ్చ గడ్డి లేదా బెల్లం కలిపిన రోటీని తినిపిస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఇంటి దగ్గర పక్షి గూడు
మీ ఇంటి ఆవరణలో లేదా వరండాలో పక్షులు గూడు కట్టుకుంటే అది అరిష్టం అని కొందరు భావిస్తారు, కానీ వాస్తు ప్రకారం అది చాలా మంచిది.
పక్షులు సురక్షితమైన చోట మాత్రమే గూడు కట్టుకుంటాయి. అది మీ ఇంట్లో సానుకూల శక్తి ఉందని చెప్పడానికి నిదర్శనం.
గూడులో పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు పుడితే, అది మీ కుటుంబ అభివృద్ధికి , వంశ వృద్ధికి సంకేతం.
నల్ల చీమల సమూహం
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నల్ల చీమలు గుంపులుగా ఆహారాన్ని తీసుకెళ్తూ కనిపిస్తే ఆందోళన చెందకండి. ఇది ఐశ్వర్యం సిద్ధించబోతోందని, నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయని చెప్పడానికి ఒక సంకేతం.
చిలుక లేదా గుడ్లగూబ కనిపించడం
చిలుక: దీన్ని శుభవార్త తెచ్చే పక్షిగా పరిగణిస్తారు. చిలుకను చూడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
గుడ్లగూబ: లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ అకస్మాత్తుగా కనిపిస్తే, నిలిచిపోయిన ధనం తిరిగి రావడం లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది.
దైవ కృతజ్ఞత మరువకండి
ఇలాంటి శుభ సంకేతాలు కనిపించినప్పుడు దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. శక్తి మేరకు పక్షులకు నీరు పెట్టడం, మూగజీవాలకు ఆహారం అందించడం వల్ల మన చుట్టూ ఉన్న సానుకూల ప్రకంపనలు మరింత పెరుగుతాయి.