Arjitha Sevas Cancelled at Srivari Temple: అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు
Arjitha Sevas Cancelled at Srivari Temple: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణను వసంత మండపంలో నిర్వహించనున్నారు. అంతకు మునుపు మృత్సంగ్రహణం, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
అక్టోబర్ 29న అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.