Perform Your Own Shraddha While Alive: బతికుండగానే తమకు తాము శ్రాద్ధం పెట్టుకోవచ్చా? గరుడ పురాణం చెప్పే ఆత్మ శ్రాద్ధం విశేషాలివే..
ఆత్మ శ్రాద్ధం విశేషాలివే..
Perform Your Own Shraddha While Alive: సనాతన ధర్మంలో పితృ పక్షానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. పూర్వీకుల ఆత్మశాంతి కోసం, వారి రుణం తీర్చుకోవడం కోసం భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు 16 రోజుల పాటు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేస్తుంటారు. అయితే సంతానం లేనివారు, బంధువులు ఎవరూ లేక ఒంటరిగా జీవించేవారికి "మరణానంతరం తమకు పిండం ఎవరు పెడతారు? సద్గతులు ఎలా లభిస్తాయి?" అనే ప్రశ్న తరచూ వేధిస్తుంటుంది. అలాంటి వారి కోసం శాస్త్రాలు ఒక ప్రత్యేక మార్గాన్ని నిర్దేశించాయి. అదే జీవ శ్రాద్ధం లేదా ఆత్మ శ్రాద్ధం.
ఏమిటీ జీవ శ్రాద్ధం?
సాధారణంగా శ్రాద్ధ కర్మలు అనేవి మరణించిన పితృదేవతల కోసం వారసులు లేదా రక్తసంబంధీకులు నిర్వహిస్తారు. కానీ ఒక వ్యక్తి తాను జీవించి ఉండగానే, తన మరణానంతర మోక్షం కోసం స్వయంగా తానే చేసుకునే కర్మకాండలను జీవ శ్రాద్ధం, జీవత్ శ్రాద్ధ లేదా ఆత్మ శ్రాద్ధం అని పిలుస్తారు. గరుడ పురాణంలోని ప్రేత కల్పం విభాగంలో ఈ విధానం గురించి సవివరమైన ప్రస్తావనలు ఉన్నాయి.
ఆత్మ శ్రాద్ధం ఎవరు చేయవచ్చు? అర్హతలు ఏమిటి?
గరుడ పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ కర్మను చేయడానికి వీల్లేదు. కేవలం నిర్దిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే శాస్త్రం ఈ వెసులుబాటు కల్పించింది.
సంతానం, వారసులు లేనివారు: తమ మరణానంతరం శ్రాద్ధ కర్మలు, ఉత్తర క్రియలు నిర్వహించడానికి ఎవరూ లేనివారు.
పూర్తిగా ఒంటరిగా మిగిలినవారు: కుటుంబం, దగ్గరి బంధువులు ఎవరూ లేక పరలోక గతులపై ఆందోళన చెందే వ్యక్తులు జీవించి ఉండగానే ఈ ధార్మిక క్రియను నిర్వహించుకోవచ్చు.
గయా క్షేత్రం.. జనార్దన స్వామి ఆలయ విశిష్టత
పిండ ప్రదానాలు, పితృ కర్మలకు బీహార్‌లోని గయా క్షేత్రం అత్యంత ప్రసిద్ధి. అయితే ఈ గయా క్షేత్రానికి కేవలం పితృ మోక్షమే కాకుం, జీవ శ్రాద్ధంతోనూ బలమైన ఆధ్యాత్మిక సంబంధం ఉంది. గయాలోని జనార్దన దేవాలయం వద్ద ఉన్న బలిపీఠం ఆత్మ శ్రాద్ధ సంప్రదాయానికి ప్రధాన వేదికగా నిలుస్తుంది. మరణానంతర కర్మల గురించి ఆందోళన చెందే నిస్సహాయులు, ఒంటరి భక్తులు గయా క్షేత్రానికి చేరుకుని, జనార్దన స్వామి సాక్షిగా తమకు తాము స్వయంగా పిండ ప్రదానం చేసుకుంటారు. పితృ పక్షం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. పూర్వీకులకే కాకుండా, వారసులు లేని వారికి కూడా మోక్షమార్గాన్ని చూపే ఇటువంటి అరుదైన వైదిక సంప్రదాయాలు సనాతన ధర్మ లోతును ప్రతిబింబిస్తాయి.