Srivari Navaratri Brahmotsavams: సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం
విజయవంతం
Srivari Navaratri Brahmotsavams: టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగాల సమన్వయం, అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తుల సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అందించిన సేవలను చైర్మన్ వివరించారు.
అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగిన నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారని చెప్పారు. వారికి వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు తెలిపారు.
గరుడసేవ రోజున ఉదయం నుంచి భారీ వర్షం కురిసినప్పటికీ భక్తులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భక్తిశ్రద్ధలతో స్వామివారి వాహనసేవను వీక్షించారని అన్నారు. వర్షంలో ఇబ్బందులు పడకుండా భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, బాదం పాలు, సుండలు, జ్యూస్, బిస్కెట్లు అందించినట్లు వివరించారు.
8 రోజుల్లో లక్షలాది మంది భక్తులకు దర్శనం
అక్టోబరు 12 నుంచి 19వ తేదీ వరకు ఎనిమిది రోజుల్లో భక్తులకు అందించిన సేవలను టీటీడీ చైర్మన్ వివరించారు.
6.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
రూ.25.79 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి.
22.60 లక్షల అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
2.44 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
34.34 లక్షల లడ్డూలు విక్రయించారు.
గరుడసేవ రోజున చైర్మన్తో పాటు పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు గ్యాలరీలు, క్యూలైన్లలో పర్యటించి భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
కళాబృందాలతో ఆధ్యాత్మిక వైభవం
వాహనసేవలకు ముందు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. 26 రాష్ట్రాలు, ఖతర్, దుబాయ్ నుంచి వచ్చిన 252 కళాబృందాలకు చెందిన సుమారు 6,777 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు.
గరుడసేవ రోజున 17 రాష్ట్రాల నుంచి 31 కళాబృందాలకు చెందిన 863 మంది కళాకారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన కళాబృందాలను ప్రతిరోజూ టీటీడీ ఈవో సన్మానించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్ఫ్లవర్స్, 80 వేల సీజనల్ పుష్పాలతో తిరుమలలో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. తిరుమల, తిరుపతిలో విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనసేవలను భక్తులు వీక్షించేందుకు 36 భారీ డిజిటల్ స్క్రీన్లు అందుబాటులో ఉంచారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించినట్లు చైర్మన్ తెలిపారు.
రవాణా, వైద్య సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 13,608 ట్రిప్పుల్లో 4.01 లక్షల మంది, తిరుమల నుంచి తిరుపతికి 13,667 ట్రిప్పుల్లో 5 లక్షల మంది ప్రయాణించినట్లు తెలిపారు.
తిరుమలలో 39 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. గత పది రోజుల్లో వీటి ద్వారా 6,900 ట్రిప్పులు నిర్వహించి సుమారు 7 లక్షల మంది భక్తులకు స్థానిక రవాణా సౌకర్యం కల్పించారు.
భక్తులకు వివిధ సేవలు అందించేందుకు 4,500 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. వైద్య సేవల కోసం 85 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది, 20 అంబులెన్సులు, నాలుగు మొబైల్ క్లినిక్లను అందుబాటులో ఉంచారు.
భారీ బందోబస్తుతో భద్రత
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత కోసం 2,800 మంది పోలీసులు, 2,000 మంది విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహించారు. గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులను అందుబాటులో ఉంచి భద్రతను పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
పారిశుద్ధ్యానికి పెద్దపీట
గరుడసేవ రోజున తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణకు 3,500 మంది సిబ్బంది సేవలందించారు. ఈ సందర్భంగా సేకరించిన సుమారు 183 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించినట్లు తెలిపారు.
సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అర్చక స్వాములు, పాలకమండలి సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగాలు, శ్రీవారి సేవకులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, భక్తులకు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
బ్రహ్మోత్సవాల విశేషాలను, శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ సదాశివరావు, శ్రీ నరేష్ కుమార్, శ్రీ దర్శన్, సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.