Divine Darshan of Kaliyamardana: కల్పవృక్ష వాహనంపై కాళీయమర్దనుడిగా దివ్య దర్శనం
కాళీయమర్దనుడిగా దివ్య దర్శనం
Divine Darshan of Kaliyamardana: కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వైభవాలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగో రోజైన మంగళవారం ఉదయం స్వామివారు కాళీయమర్దనుడి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు.
గ్రామ వీధుల్లో స్వామివారి వాహనసేవ అత్యంత వైభవోపేతంగా సాగింది. వాహనం ముందుగా భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలు నిర్వహిస్తూ గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి.
మంగళవాయిద్యాల నినాదాల మధ్య స్వామివారి ఊరేగింపు కనులపండువగా సాగగా, భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో సేవలో పాల్గొన్నారు.
పురాణాలలో కల్పవృక్షం కోరిన వరాలన్నింటినీ ప్రసాదించే దివ్య వృక్షంగా వర్ణించబడింది. అటువంటి కల్పవృక్ష వాహనంపై కాళీయమర్దనుడి రూపంలో విరాజిల్లిన శ్రీ వేణుగోపాలస్వామి భక్తుల కోర్కెలను తీర్చి, సకల శుభాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆశీర్వదించినట్లుగా భక్తులు భావించి పరవశించిపోయారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ధర్మయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చెంగల్రాయులు, అర్చకులు, అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.