Panchamukhi Ganesha Idol at Home: ఇంట్లో పంచముఖ వినాయకుడి విగ్రహం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? వాస్తు నియమాలు ఇవే..
వాస్తు నియమాలు ఇవే..
Panchamukhi Ganesha Idol at Home: హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం జరిగినా మొదటి పూజ వినాయకుడికే జరుగుతుంది. విఘ్నాలను తొలగించే ఆ గణనాథుడిని రకరకాల రూపాల్లో ఆరాధిస్తుంటారు. అందులో అత్యంత శక్తివంతమైన రూపం పంచముఖ వినాయకుడు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పంచముఖ వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అయితే పంచముఖ గణపతిని ఇంట్లో ఉంచేటప్పుడు కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పంచముఖాల విశిష్టత
పంచముఖ వినాయకుడిలోని ఐదు ముఖాలు పంచభూతాలకు (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం) ప్రతీకలు. అలాగే ఇవి మానవ శరీరంలోని ఐదు కోశాలను (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు) సూచిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ఈ రూపాన్ని పూజించడం వల్ల ఇంట్లో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి.
ఏ దిశలో ఉంచాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం పంచముఖ వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోను ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో ప్రతిష్టించాలి. పొరపాటున కూడా దక్షిణ దిశలో ఉంచకూడదు.
ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల లాభాలు
చాలా మంది తమ ఇంటి ప్రధాన ద్వారం పైన లేదా లోపలికి ప్రవేశించే గోడపై పంచముఖ గణపతి ఫోటోను పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంటిపై ఎలాంటి దిష్టి పడదని, చెడు శక్తులు లేదా నకారాత్మక ఆలోచనలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఈ ఐదు ముఖాలు రక్షణ కవచంలా కాపాడతాయని నమ్ముతారు.
ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తుంది
ఎక్కడైతే పంచముఖ వినాయకుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో పూజిస్తారో, అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని ప్రతీతి. వ్యాపారంలో నష్టాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా.. ఈ విగ్రహాన్ని పూజించడం వల్ల ధనలాభం కలిగి, ఐశ్వర్యం, సమృద్ధి చేకూరుతాయి.
పాటించాల్సిన ముఖ్య నియమాలు:
విగ్రహాన్ని ఉంచే స్థలం ఎల్లప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి.
పంచముఖ గణపతి పూజలో క్రమం తప్పకుండా దూపదీప నైవేద్యాలు సమర్పించడం వల్ల ఆ ఇల్లు ఎల్లప్పుడూ సంతోషాలతో నిండి ఉంటుంది.