Lifespan of Your House: మీ ఇంటికి ఎంత ఆయుష్షు ఉందో తెలుసా? నిర్మాణ సమయంలో ఈ గ్రహ స్థితులు ఉంటే 120 ఏళ్లు చెక్కుచెదరదు..
నిర్మాణ సమయంలో ఈ గ్రహ స్థితులు ఉంటే 120 ఏళ్లు చెక్కుచెదరదు..
Lifespan of Your House: ప్రతి ప్రాణికి జననం, మరణం ఉన్నట్లే.. మనం నిర్మించుకునే ఇంటికి కూడా ఒక నిర్దిష్ట జీవితకాలం ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు కేవలం వాస్తు, జాతకం మాత్రమే చూస్తారు. కానీ, ఇంటి దీర్ఘాయువును నిర్ణయించడంలో సంచార గ్రహాల పాత్ర అత్యంత కీలకమని ప్రముఖ జ్యోతిష నిపుణులు వెల్లడించారు.
ఆయాలు మాత్రమే సరిపోవు.. సంచారం ముఖ్యం..
సాధారణంగా ఇల్లు కట్టేటప్పుడు ధ్వజ, సింహ, వృషభ వంటి ఎనిమిది ఆయాలను పరిశీలిస్తారు. అయితే కేవలం వీటి ఆధారంగానే ఇంటి వయస్సును నిర్ణయించలేమని పండితులు పేర్కొన్నారు.
గ్రహాల ప్రభావం:
నిర్మాణం ప్రారంభించే సమయంలో గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే, కొందరు ఏడాదిలోనే ఇల్లు ఖాళీ చేయడం లేదా ఐదేళ్లలోపే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లు నేటికీ బలంగా ఉన్నాయంటే.. ఆ కాలంలో జాతకంతో పాటు సంచార గ్రహాల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడమే కారణం.
ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఎంత ఆయుష్షు?
జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్ట గ్రహ స్థానాలు ఇంటి వయస్సును ఇలా నిర్ణయిస్తాయి.. బుధ గ్రహం లగ్నంలో ఉన్నప్పుడు నిర్మాణం చేపడితే ఆ ఇంటికి 50 ఏళ్ల ఆయుష్షు ఉంటుంది. బృహస్పతి లగ్నం నుండి నాల్గవ ఇంట్లో, చంద్రుడు 11వ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి 80 ఏళ్ల వరకు ఢోకా ఉండదు. ఒక ఇల్లు 120 ఏళ్ల పాటు పదిలంగా ఉండాలంటే.. బృహస్పతి లగ్నంలో, శుక్రుడు నాల్గవ ఇంట్లో, సూర్యుడు ఆరవ ఇంట్లో ఉండాలి. అలాగే 1, 4, 7, 10 ఇళ్లలో శుభ గ్రహాలు ఉండటం విశేష ఫలితాలను ఇస్తుంది.
అపార్ట్‌మెంట్ల పరిస్థితి ఏంటి?
నేటి కాలంలో అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగింది. అయితే స్వతంత్ర ఇళ్లతో పోలిస్తే అపార్ట్‌మెంట్ల ఆయుష్షును నిర్ణయించడం క్లిష్టమని అభిప్రాయపడ్డారు. అపార్ట్‌మెంట్లలో ఒకే పునాదిపై అనేక ఫ్లాట్లు ఉంటాయి కాబట్టి వ్యక్తిగత ఫ్లాట్ ఆయుష్షును విడిగా చెప్పలేము. వీటికి భూమి బలం, ఆకాశ బలం పూర్తిగా అందవు. కాబట్టి అపార్ట్‌మెంట్ల జీవితకాలం గరిష్టంగా 60 ఏళ్లు మాత్రమే ఉండవచ్చని పండితులు విశ్లేషించారు.
ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టేది కాదు.. అది గ్రహాల అనుగ్రహంతో ఏర్పడే ఒక శక్తి క్షేత్రం. అందుకే కేవలం రాశుల మీద మాత్రమే ఆధారపడకుండా సంచార గ్రహాల శుభ సమయంలో శంకుస్థాపన చేయడం వల్ల ఇంటికి పూర్తి ఆయుష్షు లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.