TTD: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: టీటీడీ
టీటీడీ
TTD: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో ఎదురవుతున్న సమస్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. టికెట్ల కోసం ఒకేసారి భారీ సంఖ్యలో భక్తులు ప్రయత్నిస్తుండటంతోనే తీవ్ర పోటీ ఏర్పడుతోందని తెలిపింది. దీనివల్ల టికెట్లు చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతున్నాయని వివరించింది. ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ సాంకేతికంగా పటిష్టంగానే పనిచేస్తోందని స్పష్టం చేసింది.
ఒకేసారి లక్షల మంది ప్రయత్నం
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ సమయంలో సుమారు 6 లక్షల మంది యూజర్లు ఒకేసారి టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారని టీటీడీ తెలిపింది. ఒక్కో యూజర్ తనతో పాటు సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం టికెట్లు తీసుకునే అవకాశం ఉండటంతో.. మొత్తం డిమాండ్ సుమారు 24 లక్షల టికెట్ల వరకు ఉండొచ్చని పేర్కొంది.
అయితే అందుబాటులో ఉన్న టికెట్ల సంఖ్య సుమారు 2.69 లక్షలు మాత్రమే. అంటే ఉన్న టికెట్ల కంటే డిమాండ్ దాదాపు 9 రెట్లు ఎక్కువగా ఉంటోందని టీటీడీ వివరించింది.
దీంతో ఒకే సమయంలో వేలాది మంది ఒకే స్లాట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా టికెట్లు అందుబాటులోకి వచ్చిన కొద్దిసేపటికే పూర్తవుతున్నాయని తెలిపింది.
భారీ ట్రాఫిక్‌ను తట్టుకునేలా సాంకేతిక వ్యవస్థ
ఒకేసారి లక్షల సంఖ్యలో భక్తులు వెబ్‌సైట్‌లోకి వచ్చినా వ్యవస్థపై అధిక భారం పడకుండా టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
Google Cloud Platform, Load Balancing, Auto Scaling వంటి సాంకేతిక విధానాలతో ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అవసరాన్ని బట్టి సర్వర్ల సామర్థ్యాన్ని పెంచుతూ, తగ్గిస్తూ వ్యవస్థను నడుపుతున్నామని తెలిపింది.
టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేకంగా Technical War-Room ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు టీటీడీ వివరించింది. వెబ్‌సైట్ పనితీరు, సర్వర్ల పరిస్థితి, టికెట్ లావాదేవీలు, భద్రత తదితర అంశాలను సాంకేతిక నిపుణులు నిరంతరం గమనిస్తున్నారని పేర్కొంది.
‘వర్చువల్ క్యూ’ ఎందుకు?
ఒకేసారి భారీ సంఖ్యలో భక్తులు బుకింగ్ కోసం ప్రయత్నించినప్పుడు వెనుక ఉన్న సర్వర్లపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండేందుకు Virtual Queue విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
భక్తులను టికెట్లకు దూరంగా ఉంచడానికి వర్చువల్ క్యూ విధానాన్ని ఉపయోగించడం లేదని స్పష్టం చేసింది. ఒకేసారి వచ్చే భారీ ఆన్‌లైన్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నట్లు వివరించింది.
అలాగే బుకింగ్ సమయంలో ‘Slot Unavailable’ అనే సందేశం కనిపించినంత మాత్రాన ఆన్‌లైన్ వ్యవస్థ పనిచేయడం లేదని భావించవద్దని టీటీడీ కోరింది. భారీ డిమాండ్ కారణంగా అప్పటికే ఆ స్లాట్‌లోని టికెట్లు పూర్తయి ఉండటంతో కూడా ఈ సందేశం రావచ్చని తెలిపింది.
పేమెంట్ సమస్యకు అనేక కారణాలు
టికెట్ బుకింగ్‌లో చెల్లింపు ప్రక్రియ ఒక్క టీటీడీ వెబ్‌సైట్‌పైనే ఆధారపడి ఉండదని అధికారులు తెలిపారు. Payment Gateways, బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లు, UPI నెట్‌వర్క్‌లు వంటి పలు వ్యవస్థలు ఇందులో భాగస్వాములుగా ఉంటాయని వివరించారు.
అందువల్ల పేమెంట్ విఫలమైతే సమస్య టీటీడీ వ్యవస్థలోనే వచ్చిందని వెంటనే నిర్ధారించలేమని తెలిపారు. లావాదేవీ ఏ దశలో విఫలమైందో పరిశీలించిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందని స్పష్టం చేశారు.
అలాగే టికెట్ దొరకకపోవడం వేరు.. ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడం వేరు అని టీటీడీ పేర్కొంది.
బుకింగ్ వ్యవస్థలో నిరంతరం మార్పులు
భక్తుల నుంచి వచ్చే సూచనలు, ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో ఎప్పటికప్పుడు సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
వెబ్‌సైట్ పనితీరు, డేటాబేస్ సామర్థ్యం, భారీ ట్రాఫిక్‌ను నిర్వహించే విధానం, సైబర్ భద్రత, బాట్‌లను అడ్డుకోవడం, పేమెంట్ ప్రక్రియ తదితర అంశాలపై నిరంతరం మెరుగుదల చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.
గతంలో టికెట్ల బుకింగ్ సమయంలో నమోదైన ట్రాఫిక్‌ను పరిశీలించి, భవిష్యత్తులో ఎంతమంది భక్తులు ఒకేసారి బుకింగ్‌కు ప్రయత్నించే అవకాశం ఉందో అంచనా వేస్తున్నామని తెలిపింది. దానికి అనుగుణంగా సర్వర్ల సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపడుతున్నట్లు వివరించింది.