Extensive Arrangements for Devotees: భక్తులకు మరింత విశ్వాసం పెంచేలా విస్తృత ఏర్పాట్లు

విస్తృత ఏర్పాట్లు

Update: 2026-05-25 11:45 GMT

Extensive Arrangements for Devotees: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, భక్తుల్లో విశ్వాసం పెంపొందేలా విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణలతో కలిసి ఆదివారం సాయంత్రం అడిషనల్ ఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం కేంద్రాలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు.

భక్తుల సౌకర్యార్థం ఆ ప్రాంతాల్లో నాణ్యమైన మౌలిక వసతులు, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధానం, వర్షాలకు తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్, జిల్లా పోలీసులు, టిటిడిలోని వివిధ విభాగాలు, శ్రీవారి సేవకులు సమన్వయంతో నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.

రోజుకు లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వచ్చినప్పటికీ, భక్తుల సంఖ్య, దర్శన సమయం, క్యూలైన్ల పరిస్థితి, ముందురోజు దర్శనాల వివరాలు వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సీజన్‌లో భక్తుల రద్దీ భిన్నంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టిటిడి అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భక్తులు తిరుమలకు వస్తే, అందరికీ సమర్థవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడం మరింత సులభమవుతుందన్నారు. 

Tags:    

Similar News