Varalakshmi Vratam: ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతానికి వైభవంగా ఏర్పాట్లు
వైభవంగా ఏర్పాట్లు
Varalakshmi Vratam: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నానితో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జేఈవో సూచించారు. గత అనుభవాలను సమీక్షించి, లోపాలను సరిదిద్దుతూ భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతి కల్పించాలని ఆదేశించారు.
ఆగస్టు 21న శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్‌సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.
భక్తులకు విస్తృత సౌకర్యాలు
మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు, పెండాళ్లు, సూచిక బోర్డులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని జేఈవో ఆదేశించారు. తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం విస్తృతంగా అందించడంతో పాటు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచాలన్నారు.
భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలని, ఆలయం, ఆస్థానమండపం పరిసరాలను పుష్పాలు, విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించాలని సూచించారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిని సమకూర్చుకోవాలని, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీసు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.