Sri Mahalakshmi Deepa Puja: పలమనేరులో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీప పూజ
శ్రీ మహాలక్ష్మీ దీప పూజ
Sri Mahalakshmi Deepa Puja: పలమనేరులోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మీ దీప పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. పలమనేరు, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళా భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దీప పూజలో పాల్గొన్నారు.
ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి: జేఈవో
దీపం ఇంటికే కాదు.. సమాజానికీ వెలుగునిస్తుందని టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ అన్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
సకల సంపదలకు అధిష్ఠాన దేవతగా కొలువబడే శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దీపాలతో ఆరాధించడం ద్వారా ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించాలని ఆయన అన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతో కూడిన ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సనాతన ధర్మంపై విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు.
మహాలక్ష్మీ దీపోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉంది: ఎమ్మెల్యే
పలమనేరులో శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎన్. అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు.
వేలాది దీపాల కాంతులతో కళాశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో, భక్తిభావంతో దేదీప్యమానంగా మారిందన్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి కృప ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
ఆగమశాస్త్రబద్ధంగా పూజా కార్యక్రమాలు
ఈ సందర్భంగా అర్చకులు ఆగమశాస్త్రోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో దీప పూజను భక్తిశ్రద్ధలతో చేయించారు.
వేద మంత్రోచ్చారణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు, వేలాది దీపాల కాంతులతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.
భక్తి.. ధర్మం.. ఆధ్యాత్మిక చైతన్యం
శ్రీ మహాలక్ష్మీ దీప పూజ ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం, సనాతన ధర్మ విలువలను పరిరక్షించడం, భక్తిభావాన్ని మరింత బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని అర్చకులు తెలిపారు.