Karthika Masam Tradition: జనబాహుళ్యంలో యుగయుగాలుగా ఆచరణలో ఉన్న ఒక ఉత్సాహభరిత, ఉదాత్త సంప్రదాయం వనభోజనం. కార్తికమాసం అంటేనే శివకేశవులిద్దరి ఆరాధనకు సమాన వేదిక. అలాంటి పవిత్ర మాసంలో నిర్వహించే ఆధ్యాత్మిక, ఆరోగ్య, సామాజిక చేతన నేపథ్యం ఉన్న వేడుక ఇది. ప్రకృతితో పరమాత్మను అనుసంధానించే విశిష్ట కార్యక్రమమిది.

కార్తికమాసం అనగానే గుర్తుకువచ్చేది కార్తిక దీపాలు, శైవ, వైష్ణవ క్షేత్ర దర్శనాలు. వీటితోపాటు ఆధ్యాత్మికతను, సామాజిక సామరస్యాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను ఒకే తాటిపైకి తెచ్చే విశిష్ట సంప్రదాయం వనభోజనం. దీని వెనుక భక్తిభావనతోపాటు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరదృతువు ముగిసి హేమంత రుతువు ప్రారంభమయ్యే ఈ సమయంలో ఉసిరి, వేప, మామిడి వంటి చెట్ల కింద గడపడం వల్ల శుద్ధమైన ప్రాణవాయువు లభిస్తుంది. తద్వారా చెట్లు ఎంత మేలు చేస్తాయో బోధపడుతుంది.

పరమాత్మ రూపమైన ప్రకృతి ఒడిలో దైవాన్ని ధ్యానిస్తూ, అందరూ కలిసి కులాసాగా భోజనం చేయడం విశ్వశాంతికి సోపానమని చాటుతుంది. వనభోజనాల్లో ప్రధాన ఘట్టం ఉసిరిచెట్టు పూజ. కార్తిక మాసంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఈ వృక్షంలో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వనభోజన సమయంలో ఆరోగ్యానందాల ప్రాప్తికోసం ఉసిరిని పూజిస్తారు.

ఉసిరిచెట్టు వద్ద అలికి, ముగ్గులు పెట్టి విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా పటాన్ని ఉంచి, దీపారాధన చేస్తారు. షోడశోపచార పూజలు నిర్వహించి, చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. శ్రీసూక్తం, విష్ణు సహస్రనామాలు పఠిస్తారు. ఉసిరి చెట్టు నీడన చేసే భోజనాన్ని ‘ధాత్రి ఛాయా భోజనం’ అంటారు.

ఎందుకింత ప్రత్యేకం..?!

ధాత్రీమూలే కృతం స్నానం ధాత్రీమూలే జపస్తథా

ధాత్రీమూలే కృతం దానం సర్వం కోటిగుణం భవేత్

ఉసిరిచెట్టు (ధాత్రి వృక్షం) మొదట్లో చేసే స్నానం, జపం, దానం కోటి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి. ఈ చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించేవారికి వంద కోట్ల కల్పాల వరకు పునర్జన్మ ఉండదు. కార్తికమాసంలో ఉసిరిచెట్టు నీడన అతిథులకు భోజనం పెట్టినవారికి మోక్షం లభిస్తుంది.

ఇక్కడ భోజనం చేసేటప్పుడు ఎన్ని ఉసిరిఆకులు భూమిపై రాలుతాయో, అన్ని వేల సంవత్సరాల పాటు ఆ వ్యక్తి వైకుంఠంలో పూజలందుకుంటాడు. ఈ చెట్టు నీడన భోజనం చేసేవారు ఎన్ని మెతుకులు తింటారో, అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో గౌరవాన్ని పొందుతారు. ఇలా ఉసిరిచెట్టు కింద వనభోజనానికి ఎంతో పుణ్యఫలం ఉందని స్కాంద, పద్మపురాణాలు తెలియజేశాయి.

సర్వపాప విముక్త్యర్థం వనభోజన ముత్తమం అని స్కాంద పురాణం స్పష్టం చేసింది. పాపాల నుంచి విముక్తి పొందే మార్గాల్లో వనభోజనం శ్రేష్ఠమని దీని భావం. కార్తికపురాణం ప్రకారం నైమిశారణ్యంలో సూతమహర్షి ఆధ్వర్యంలో మునులు వనభోజనాలు చేశారు. భాగవతంలో శ్రీకృష్ణుడు బలరాముడు, గోపబాలురతో కలిసి వనభోజనం చేసినట్లు ఉంది.

ఉసిరి చెట్టు మూలంలో శ్రీహరి, కాండంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మ, కొమ్మల్లో సూర్యుడు, రెమ్మల్లో దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఉసిరి నీడన భోజనం చేయడం వల్ల ఆయుర్వేద ప్రయోజనాలు కూడా లభిస్తాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వనభోజనం కేవలం భోజనం మాత్రమే కాదు. ఇది కుటుంబ అనుబంధాలను బలోపేతం చేస్తుంది, పిల్లలకు ప్రకృతి ప్రాముఖ్యతను నేర్పుతుంది, సామాజిక సామరస్యాన్ని పెంచుతుంది. ప్రకృతిని దైవంగా ఆరాధించే ఈ సంప్రదాయం నేటి ఆధునిక జీవనంలో మరింత అవసరం. కార్తికమాసంలో ఉసిరి చెట్టు కింద ఒక్కసారైనా వనభోజనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక, ఆరోగ్య, సామాజిక ప్రయోజనాలను పొందవచ్చు.

Tags: