Ravana’s Nine Unfulfilled Desires: రామాయణంలో రావణుడు మహా బలశాలి, వేదవేదాంగాలు తెలిసిన పండితుడు, పరమశివుడికి పరమభక్తుడు. సంగీత, శాస్త్రజ్ఞానాల్లో అసాధారణ ప్రతిభ కలిగినవాడు. బంగారు లంకకు అధిపతి. అయినా అతడి జీవితంలో కొన్ని కోరికలు నెరవేరలేదని ప్రచారంలో ఉన్న కథనాలు తెలియజేస్తున్నాయి. ఆ కోరికల వెనుక ఆశలకు, అహంకారానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు దాగి ఉన్నాయి.

మొదటి కోరిక అమరత్వం. దేవతలు, దానవులు తదితరుల చేతిలో మరణం సంభవించకూడదని తపస్సు చేశాడు. మానవులను తక్కువగా అంచనా వేసి వారిని మినహాయించాడు. దాంతో శ్రీరాముడి చేతిలో మరణించాడు. రెండో కోరిక స్వర్గానికి మెట్ల నిర్మాణం. భూమి నుంచి స్వర్గానికి మెట్లు నిర్మించి అక్కడికి సులభంగా వెళ్లే ఏర్పాటు చేయాలని కోరుకున్నాడు. మూడో కోరిక సముద్ర జలం తియ్యగా మారాలని. ఉప్పునీటితో నిండిన సముద్రపు నీరు తాగడానికి అనువుగా మారాలని ఆశించాడు.

నాలుగో కోరిక స్వర్ణానికి పరిమళం ఉండాలని. బంగారాన్ని అమితంగా ప్రేమించిన రావణుడు, అది సువాసన వెదజల్లితే బంగారం ఎక్కడున్నా సులభంగా గుర్తించవచ్చని కాంక్షించాడు. ఐదో కోరిక రక్తం రంగు తెల్లగా ఉండాలని. రక్తపాతం జరిగినప్పుడు అది ఎరుపు రంగులో కనిపించకుంటే బాగుంటుందని భావించాడు. ఆరో కోరిక మద్యానికి దుర్వాసన ఉండకూడదని. మద్యం వాసన తొలగిపోవాలని కోరుకున్నాడు.

ఏడో కోరిక అందరూ తననే ఆరాధించాలని. దేవతలను కాకుండా అంతా తననే ఆరాధించాలని ఆశించాడు. ఎనిమిదో కోరిక మానవులందరి శరీర ఛాయ ఒకేలా ఉండాలని. అలా ఉంటే వారిని గుర్తించడం సులువవుతుందని భావించాడు. తొమ్మిదో కోరిక తండ్రి బతికుండగా సంతానం మరణించకూడదని. రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు, అక్షకుమారుడు తదితర కుమారులు మరణించారు. సంతానాన్ని కోల్పోవడం రావణుడి జీవితంలో అత్యంత విషాదకరమైన పరిణామం.

ఈ వివరాలు ప్రామాణిక రామాయణంలో లేవు. విస్తృత ప్రచారంలో ఉన్న కథనాలుగా మాత్రమే స్వీకరించాలి. శక్తిసామర్థ్యాలు, విద్య, అధికారం, సంపదలు ఉన్నంతలో సరిపోదు. అహంకారం విచక్షణను కప్పివేస్తే అధర్మం పతనానికి దారితీస్తుంది. ఇతరులను జయించినవాడు గొప్పవాడు కావచ్చు. కానీ తనను తాను జయించినవాడే నిజమైన విజేత. అహంకారం వల్ల పతనం తప్పదని రావణాసురుడి కథ తెలియజేస్తుంది.

Tags: