Karthika Pournami: నవంబరు 24, 2026న వచ్చే కార్తీక పౌర్ణమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. కార్తీక మాసమంతా పవిత్రమైనదే అయినప్పటికీ, ఈ మాసానికి పూర్ణత్వం సిద్ధించే రోజు పౌర్ణమి. ఆషాఢం నుంచి కార్తీకం వరకు వచ్చే ఐదు పూర్ణిమలను వ్యాస పూర్ణిమలు అంటారు. వాటిలో అత్యుత్తమమైనది కార్తీక పౌర్ణమి. దీన్ని త్రిపుర పౌర్ణమి, రాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

పరమశివునికి ప్రీతికరమైన ఈ మాసంలో స్నానం, దీపం, ఉపవాసం, జపం, దానం చేయడం ఎంతో శ్రేష్ఠం. అందులోనూ పౌర్ణమి నాడు వీటికి మరింత విశిష్టత చేకూరుతుంది. శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, కౌమారం అనే షణ్మతాలన్నింటికీ అనుసంధానమైన పర్వదినమిది. ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు దీని ప్రాముఖ్యతను విస్తృతంగా చాటిచెప్పాయి.

కార్తీక పౌర్ణమితో ముడిపడిన ప్రధాన పౌరాణిక కథ త్రిపురాసుర సంహారం. తారకాసురుని కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహంతో ఆకాశంలో ప్రయాణించగల మూడు నగరాలను (త్రిపురాలు) నిర్మించారు. వాటిలో తిరుగుతూ లోకాలను బాధించసాగారు. దేవతల కోరిక మేరకు పరమశివుడు భూమిని రథంగా, సూర్యచంద్రులను చక్రాలుగా, మేరు పర్వతాన్ని విల్లుగా, వాసుకిని అల్లెతాడుగా, విష్ణువును బాణంగా చేసుకుని ఒకే బాణంతో మూడు పురాలను దహనం చేశాడు. ఆ రోజే కార్తీక పౌర్ణమి. అందుకే దీన్ని త్రిపుర పౌర్ణమి అంటారు.

తాత్వికంగా చూస్తే, మనిషిలోని సాత్విక, రాజస, తామస గుణాలే త్రిపురాలు. విష్ణువు జ్ఞానం. పరమేశ్వరుని అనుగ్రహంతో జ్ఞానమనే బాణంతో అహంకారం, అజ్ఞానం, స్వార్థం అనే త్రిపురాలను సంహరించినప్పుడు మనలో జ్ఞానమనే నిండు చంద్రుడు ప్రకాశిస్తాడు. త్రిపురాసుర సంహారంలో మొదట్లో ఆటంకాలు ఎదురైనప్పుడు గణపతిని పూజించగా అవి తొలగిపోయాయని కథనం.

పార్వతిమాత శివునిలో సగభాగం కావాలని కోరుకుని, ఆయన సూచన మేరకు కేదారేశ్వర వ్రతం ఆచరించింది. వ్రతం, జపం, ధ్యానం, దానం, ఉపవాసాలతో శివుడిని మెప్పించి అర్ధనారీశ్వరత్వాన్ని పొందిన దినంగా కార్తీక పౌర్ణమిని భావిస్తారు.

వైష్ణవ సంప్రదాయంలో మార్గశిర ఏకాదశి నుంచి 24 కేశవ నామాలతో వ్రతం ప్రారంభమవుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాటికి 12వ నామమైన దామోదర నామం వస్తుంది. అందుకే ఈ మాసాన్ని దామోదర మాసం అంటారు. పౌర్ణమి నాడు వైష్ణవులు దామోదర వ్రతం, తులసి పూజ, దీపదానం చేస్తారు. బృందావనంలో బాలకృష్ణుడు మురళీ గానం చేయగా గోపికలు ఆత్మాభిమానాన్ని కూడా వదిలి ఆయనతో నృత్యగానం చేశారు. అనేకమంది కలిసి చేసే ఈ నాట్యాన్ని రాసం అంటారు. రాసలీల అంటే కామలీల కాదు. జీవుడు తన అస్తిత్వాన్ని మరచి పరమాత్మలో ఐక్యమయ్యే తన్మయ స్థితి.

కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ స్నానం శారీరక శుద్ధి మాత్రమే కాదు. శరీరం నుంచి మనసు, మనసు నుంచి ఆలోచన, అక్కడి నుంచి జీవన శుద్ధి జరగాలి. స్నానం, ఉపవాసం ద్వారా శరీరం, జపం ద్వారా మనసు, ధ్యానం ద్వారా ఆలోచనలు నిర్మలమవుతాయి. దానం ద్వారా స్వార్థరాహిత్యం కలుగుతుంది. దీపం ద్వారా అజ్ఞానం తొలగుతుంది. ఇలా సంపూర్ణ ఆధ్యాత్మిక జీవనశైలిని అందిస్తుంది.

బృహదారణ్యకోపనిషత్తులోని ‘అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతం గమయా’ అనే మంత్రానికి ఆచరణ రూపమే కార్తీక పౌర్ణమి నాటి స్నాన, ధ్యాన, దాన, దీపాదులు. మన సంస్కృతిలో ప్రకృతిని దైవంగా భావించి రావి, తులసి, ఉసిరి చెట్లను ఆరాధిస్తారు. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం, వనభోజనం చేయడం పవిత్రంగా భావిస్తారు. అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగు వైపు పయనించడమే ఈ పర్వం అంతరార్థం. మనసులో శాంతి, హృదయంలో దయ, ఆలోచనల్లో పవిత్రత, జీవితంలో ధర్మం ఉండటమే పూర్ణత్వమని ఇది ప్రబోధిస్తుంది.

2026లో పౌర్ణమి తిథి నవంబరు 23 రాత్రి 11:42 నుంచి నవంబరు 24 రాత్రి 8:23 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం నవంబరు 24నే పర్వం జరుపుకుంటారు. నదీస్నానం, దీపదానం, జ్వాలాతోరణ దర్శనం, తులసి పూజ వంటివి ఈ రోజు విశేషంగా ఆచరిస్తారు.

Tags: