Vikarna: అధర్మాన్ని ఎదిరించి ఒంటరిగా నిలిచిన కౌరవ వీరుడు: వికర్ణుడి ధర్మగాథ
| వికర్ణుడి ధర్మగాథ
Vikarna: మహాభారత సంగ్రామంలో శత్రుపక్షానికి చెందిన వికర్ణుడు మరణించగానే భీమసేనుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. అధర్మాన్ని నిలదీసి, ప్రాణాలకు తెగించి ధర్మం వైపు నిలిచిన ఘనత వికర్ణుడిదే. ధృతరాష్ట్రుడి వందమంది పుత్రుల్లో దుర్యోధన, దుశ్శాసనుల తర్వాత మూడో కుమారుడు వికర్ణుడు. కౌరవులందరూ దుర్యోధనుడి అడుగుజాడల్లో నడుస్తూ పాండవులపై అసూయాద్వేషాలను పెంచుకుంటే, వికర్ణుడు మాత్రం చిన్నప్పటి నుంచే భిన్నమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.
ద్రోణాచార్యుడి వద్ద విలువిద్యను అభ్యసించి మహా పరాక్రమవంతుడిగా ఎదిగాడు. అపారమైన ధర్మశాస్త్ర జ్ఞానం, సత్యవాక్పరిపాలన, పెద్దల పట్ల గౌరవం అతని సహజ లక్షణాలు. శకుని మాయా జూదంలో సర్వస్వాన్ని కోల్పోయిన ధర్మరాజు చివరికి ద్రౌపదిని పణంగా పెట్టగా కౌరవులు కపటంతో గెలిచారు. దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొచ్చి అవమానిస్తున్నప్పుడు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ధృతరాష్ట్రుడు వంటి మహామహులు తలదించుకుని మౌనంగా ఉండిపోయారు.
అప్పుడు అధర్మాన్ని నిలదీసిన ఏకైక గళం వికర్ణుడిది. అతను సభలోని పెద్దలను ఉద్దేశించి “ఇక్కడ జరుగుతున్నది ఘోరమైన అధర్మం. జూద వ్యసనంలో ఉన్న వ్యక్తి చెప్పిన మాటలు ధర్మబద్ధం కావు. పైగా ధర్మరాజు జూదంలో తనను తాను ముందే ఓడిపోయాడు. అలాంటప్పుడు ద్రౌపదిని పణంగా పెట్టే హక్కు అతనికెలా ఉంటుంది? కాబట్టి ఈ బంధనం చెల్లదు, ద్రౌపదిని విడుదల చేయాలి” అన్నాడు. సోదరులు దుర్యోధన, దుశ్శాసనులను ఎదిరించి కర్ణుడి ఆగ్రహానికి గురైనప్పటికీ వికర్ణుడు తాను నమ్మిన ధర్మానికే కట్టుబడ్డాడు. ద్రౌపది ఆత్మగౌరవం కోసం మాట్లాడిన ఏకైక కౌరవుడు అతనే.
కురుక్షేత్ర యుద్ధంలో వికర్ణుడు కౌరవుల తరఫునే పోరాడాడు. తన సోదరులు తప్పు చేస్తున్నారని తెలిసినా ఆపద సమయంలో రాజును, తోడబుట్టినవారిని వదిలేయడం క్షత్రియ ధర్మానికి, రాజ విశ్వాసానికి వ్యతిరేకమని భావించాడు. అందుకే కౌరవ పక్షాన నిలిచి పాండవ సైన్యాన్ని గడగడలాడించాడు. ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా వందమంది కౌరవులను చంపుతానని భీముడు శపథం చేశాడు. యుద్ధ రంగంలో భీముడు, వికర్ణుడు ముఖాముఖి తలపడ్డారు. భీముడు “వికర్ణా! నువ్వు ధర్మాత్ముడివి! నీతో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు, పక్కకు తొలగు” అన్నాడు.
కానీ వికర్ణుడు చిరునవ్వుతో “భీమసేనా! కురుసభలో నేను నా ధర్మాన్ని నెరవేర్చాను. ఇక్కడ యుద్ధరంగంలో కౌరవ సైనికుడిగా నా క్షత్రియ ధర్మాన్ని నెరవేరుస్తున్నాను. నీ ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చుకో” అని బదులిచ్చాడు. చివరికి భీముడి చేతిలో వికర్ణుడు వీరమరణం పొందాడు. వికర్ణుడు కింద పడిపోగానే భీముడు అతని మృతదేహాన్ని హృదయానికి హత్తుకుని “ధర్మాత్ముడవైన నిన్ను చంపాల్సి వచ్చినందుకు నా గుండె బద్దలవుతోంది” అంటూ దుఃఖించాడు. వికర్ణుడి పాత్ర ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచం లేదా సొంత మనుషులు అధర్మం వైపు వెళ్తున్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నా సరే నిలబడి “ఇది తప్పు” అని చెప్పే ధైర్యం ఉండాలి. తోడబుట్టినవారైనప్పటికీ వారి తప్పును ఎండగట్టి క్షత్రియ ధర్మం కోసం ప్రాణాలర్పించిన వికర్ణుడు ఆదర్శప్రాయుడైన ధర్మమూర్తిగా నిలిచిపోయాడు. కౌరవులలో ఒకడైనప్పటికీ తన ఉదాత్తమైన వ్యక్తిత్వంతో మహాభారత ఇతిహాసంలో ధృవతారలా ప్రకాశించాడు వికర్ణుడు.