Lighting a Lamp Near the Tulsi Plant: సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసిని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు. రోజూ సాయంత్రం సంధ్యా సమయంలో తులసి కోట ముందు దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించడమే కాకుండా, సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. అయితే తులసి వద్ద దీపం పెట్టే సమయంలో సరైన మంత్రాలు పఠించడం, కొన్ని వాస్తు నియమాలు పాటించడం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.

తులసి పూజలో పఠించాల్సిన ప్రధాన మంత్రాలు

తులసి కోట వద్ద దీపం వెలిగించి నమస్కరించే సమయంలో సాధారణంగా భక్తులు ఓం తులసీదేవ్యై నమః అనే నామాన్ని జపించవచ్చు. ఇది మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను పెంచుతుంది.

రోగ నివారణ, సర్వసౌభాగ్యాలు కలిగించే శక్తివంతమైన శ్లోకం

తులసి పూజలో తప్పక పఠించాల్సిన అత్యంత విశేషమైన శ్లోకం ఇది:

"మహాప్రసాద జననీ సర్వసౌభాగ్యవర్ధినీ.. ఆధివ్యాధిహరాం నిత్యం తులసీ త్వాం నమామ్యహమ్"

ఈ పవిత్ర శ్లోకాన్ని పూర్తి భక్తిశ్రద్ధలతో పఠించడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు, ఆధి-వ్యాధులు తొలగిపోతాయి. ఇంట్లో దైవిక వాతావరణం ఏర్పడి తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుందని నమ్ముతారు.

దీపం పెట్టేటప్పుడు పాటించాల్సిన వాస్తు నియమాలు - జాగ్రత్తలు

శుభ్రత తప్పనిసరి: తులసి పూజ చేసేటప్పుడు ఎటువంటి తొందరపాటు లేకుండా, చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కుని పవిత్రమైన మనసుతో పూజించాలి.

నేలపై నేరుగా దీపం ఉంచవద్దు:

తులసి కోట వద్ద దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై పెట్టకూడదు. ప్రమిద కింద చిన్న ప్లేటు గానీ, లేదా కొద్దిగా బియ్యం వేసి దానిపై దీపాన్ని ప్రతిష్ఠించాలి.

ముఖం ఏ దిశలో ఉండాలి?:

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి వద్ద దీపం వెలిగించేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు దిక్కుకు ముఖం చేసి కూర్చోవడం అత్యంత శ్రేయస్కరం. ఈ దిశల్లో పూజించడం వల్ల వాస్తు దోషాలు తొలగి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

గాలికి ఆరిపోకుండా రక్షణ:

వెలిగించిన దీపం గాలికి మధ్యలోనే ఆరిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీపం చుట్టూ రక్షణ ఉండేలా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి.

శాస్త్రోక్తంగా, నియమబద్ధంగా నిత్యం సంధ్యా సమయంలో తులసి పూజ చేసి దీపారాధన చేస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి, ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

Tags: