Srivari Navaratri Brahmotsavams: సమిష్టి కృషితో విజయవంతమైన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Srivari Navaratri Brahmotsavams: తిరుమల శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో విజయవంతంగా నిర్వహించారని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, స్వామివారి వాహన సేవలు, మూలమూర్తి దర్శనాన్ని సంతృప్తికరంగా అందించడంలో సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక్కరినీ ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించిన సౌకర్యాలు, వివిధ విభాగాల పనితీరును ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల తొలి రోజుల్లో ఎదురైన చిన్నపాటి ఇబ్బందులను గుర్తించి, అవసరమైన సవరణలు చేపడుతూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేశారని తెలిపారు. ఆలయంలో, వెలుపల గార్డెన్, ఎలక్ట్రికల్ విభాగాలు ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన శోభాయమానమైన విద్యుత్ అలంకరణలు భక్తులకు కనువిందు చేశాయని పేర్కొన్నారు.
అన్నప్రసాదం నుంచి పారిశుద్ధ్యం వరకు.. సేవల్లో సమర్థత
అన్నప్రసాదం విభాగం లక్షలాది మంది భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదాలను విస్తృతంగా అందించిందని ఈవో ప్రశంసించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారని, ఆరోగ్యశాఖ తిరుమలలో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణలో చక్కటి పనితీరు కనబరిచిందని అభినందించారు. అదేవిధంగా కల్యాణకట్ట, వైద్య, రవాణా, వసతి, అటవీ విభాగాలు అందించిన సేవలను ప్రశంసించారు. భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనశాలలు బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. టీటీడీలోని వివిధ విభాగాలకు అవసరమైన పనులను ఇంజినీరింగ్ విభాగం సకాలంలో పూర్తి చేసిందని ఈవో పేర్కొన్నారు. భవిష్యత్తులో సివిల్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ తదితర పనుల్లో జాప్యం జరగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. మార్కెటింగ్ విభాగం ముడిసరుకుల కొనుగోలుకు కనీసం 90 రోజుల ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ముందస్తు ప్రణాళికలు, విభాగాల మధ్య సమన్వయం, నిరంతర పర్యవేక్షణతో సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. శ్రీవారి సేవకులు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విద్యార్థినీ విద్యార్థులు భక్తులకు అందించిన సేవలు అభినందనీయమని ఈవో కొనియాడారు. బ్రహ్మోత్సవాల వాహన సేవలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తిరుమలకు రాలేని కోట్లాది మంది భక్తులకు చేరువ చేసిందని తెలిపారు. వచ్చే ఏడాది మరింత ఆకర్షణీయమైన కార్యక్రమాలతో భక్తులను అలరించేలా ప్రసారాల నాణ్యతను, కార్యక్రమాల రూపకల్పనను మెరుగుపరచాలని సూచించారు.
దేశవ్యాప్త కళా వైభవంతో కనువిందు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వేలాది మంది కళాకారులు వాహన సేవల ముందు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని ఈవో తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించిన సంబంధిత విభాగాలను అభినందించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో (విద్య, ఆరోగ్యం) శ్రీ సి. గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ విభాగాల పనితీరును ఈవోకు వివరించారు. అనంతరం వివిధ విభాగాధిపతులు బ్రహ్మోత్సవాల నిర్వహణపై రూపొందించిన నివేదికలను నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా సమర్పించారు.
1. శాశ్వతంగా కొనసాగించాల్సిన కార్యక్రమాలు*
2. ప్రణాళిక ప్రకారం అమలు కాని కార్యక్రమాలు*
3. అనూహ్యంగా ఎదురైన సమస్యలు – తీసుకున్న దిద్దుబాటు చర్యలు*
4. మరింత మెరుగుపరచాల్సిన అంశాలు*
ఈ అంశాలపై సమీక్షిస్తూ, విజయవంతమైన కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించడం, లోపాలను సరిదిద్దుకోవడం, అనూహ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ముందస్తు కార్యాచరణ రూపొందించడం, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలపై చర్చించారు.