Lord Rama: రామనామ స్మరణతో మార్మోగిన తిరువీధులు

మార్మోగిన తిరువీధులు

Update: 2026-03-25 07:29 GMT

Lord Rama: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మంగళవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 8.30 గంటలకు శ్రీ సీతా–లక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు.

భక్తుల రామనామ స్మరణతో తిరుపతి తిరువీధులు మార్మోగాయి.

డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు భక్తి భావంతో రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన అనంతరం ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.

రథోత్సవానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తాత్పర్యం ఉంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులుగా భావిస్తారు. ఈ విధంగా శరీరాన్ని రథంతో పోల్చడం ద్వారా శరీరం వేరని, ఆత్మ భిన్నమని తెలియజేసే ఆత్మ–అనాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవం ద్వారా భక్తులకు ఈ తత్త్వజ్ఞానం తెలియజేయబడుతుంది.

మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి. భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఇంజినీరింగ్ అధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మార్చి 25న చక్రస్నానం

శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు.

Tags:    

Similar News