Lord Rama: హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం
శ్రీ సీతారామలక్ష్మణుల విహారం
Lord Rama: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది.
శ్రీ సీతారామలక్ష్మణులు తమ ప్రియ భక్తుడైన హనుమంతుని వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ ఘనంగా కొనసాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన హనుమంతుడు దాసభక్తికి ప్రతీకగా నిలిచారు. రాముడు హనుమంతునికి ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదించే హనుమంతుని సేవాభావాన్ని స్మరించుకుంటూ స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు.
ఈ వాహన సేవలో డెప్యూటీ ఈఓ శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.