Nirjala Ekadashi Significance: నిర్జల ఏకాదశి మహత్యం: ఒక్క ఉపవాసంతో ఏడాది పుణ్యం!

ఏడాది పుణ్యం!

Update: 2026-06-23 13:19 GMT

Nirjala Ekadashi Significance: హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లోకెల్లా అత్యంత పవిత్రమైనది, శక్తివంతమైనది... 'నిర్జల ఏకాదశి'. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది.నిర్జల' అంటే... నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండటం. సాధారణంగా ఏకాదశి రోజున పండ్లు, పాలు లేదా అల్పాహారం తీసుకుంటారు. కానీ, నిర్జల ఏకాదశి రోజున మాత్రం సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు కనీసం మంచినీరు కూడా ముట్టకుండా కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు.

ఈ ఏకాదశి వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. మహాభారతంలో భీముడు భోజనప్రియుడు. రోజు మొత్తం ఉపవాసం ఉండటం అతని వల్ల అయ్యేది కాదు. మిగతా ఏకాదశులన్నీ చేయలేకపోతున్నానని బాధపడుతున్న భీముడికి, వ్యాస మహర్షి ఒక మార్గం చెప్పారు. 'ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశులు చేయకపోయినా... ఈ ఒక్క నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే, మిగిలిన 23 ఏకాదశుల పుణ్యఫలం దక్కుతుంది' అని ఉపదేశించారు. అందుకే దీనిని 'భీమ ఏకాదశి' లేదా 'పాండవ ఏకాదశి' అని కూడా పిలుస్తారు.

ఈ ఏడాది జూన్ 25న నిర్జల ఏకాదశి జరుపుకోనున్నారు. ఈ రోజున తెల్లవారుజామునే లేచి, పవిత్ర స్నానం ఆచరించి, శ్రీమహావిష్ణువును భక్తితో పూజించాలి. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం, "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.నిర్జల ఏకాదశి కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్య పరంగా కూడా మన శరీరంలోని వ్యర్థాలను తొలగించి, జీర్ణవ్యవస్థకు పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. ఈ పవిత్రమైన రోజున శక్తి కొలది పేదలకు, బ్రాహ్మణులకు చల్లని నీరు, మజ్జిగ, గొడుగులు, విసనకర్రలు దానం చేయడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

Tags:    

Similar News