Offer These to Lord Hanuman on Tuesday: హిందూ సంప్రదాయంలో వారంలోని ప్రతి రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది. ఈ క్రమంలోనే మంగళవారాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం, రామభక్తుడైన ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. మంగళవారాల్లో హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల జీవితంలోని సమస్త కష్టాలు, ఆందోళనలు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల బాధల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఈ రోజుల్లో చాలామందిని వేధించే ప్రధాన సమస్య.. ఏదో ఒక అనారోగ్యం చుట్టుముట్టడం. ఎంత ఖరీదైన మందులు వాడినా కొందరికి వ్యాధులు నయం కావు. అటువంటి శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మంగళవారం నాడు స్వామివారికి చేయాల్సిన కొన్ని ప్రత్యేక పూజలు, ఆచారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హనుమాన్ చాలీసా పఠనం

మంగళవారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, సంపూర్ణ పవిత్రతతో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలీసాలోని ఈ క్రింది చరణాన్ని నిరంతరం స్మరించడం వల్ల ఎంతటి మొండి వ్యాధులైనా నయమవుతాయని నమ్ముతారు.

"నాశై రోగ హరై సబ్ పీరా | జపత్ నిరంతర్ హనుమత్ బీరా ||

సింధూర సమర్పణ - విశేష నైవేద్యాలు

హనుమంతునికి అత్యంత ఇష్టమైన వాటిలో సింధూరం ఒకటి. మంగళవారం నాడు హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామివారికి సింధూరాన్ని సమర్పించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పూజ అనంతరం ఆ సింధూరాన్ని నుదుటున ధరించడం వల్ల ప్రతికూల (నెగటివ్) శక్తులు దరిచేరవు.

నైవేద్యాలు:

స్వామివారికి సింధూరంతో పాటు అటుకులు, బెల్లం, కల్కండ, శనగపప్పు, లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం.

తమలపాకుల దండ

చేపట్టే పనుల్లో విజయం లభించాలన్నా, సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలన్నా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించడం చాలా శ్రేష్ఠం. ఈ పరిహారం చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోయి, వ్యాధుల నుండి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది.

దీపారాధన - నిమ్మకాయ దీపం

మంగళవారాల్లో హనుమంతుని ముందర ఆవు నెయ్యి లేదా మంచి నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని గృహనిర్బంధాలు, పీడలు తొలగిపోతాయి.

విశేష పరిహారం: ఒ

క నిమ్మకాయను తీసుకొని, దానిని రెండు ముక్కలుగా కోసి, రసాన్ని పూర్తిగా పిండేయాలి. ఆ నిమ్మకాయ చిప్పలను బోర్లించి, అందులో నెయ్యి పోసి ఒత్తి వేసి దీపం వెలిగించాలి. ఈ నిమ్మకాయ దీపారాధన అంటే స్వామివారికి మహా ప్రీతి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఈ మంగళవారం నాడు మీ శక్తి కొలది హనుమంతునికి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి, స్వామివారి కృపాకటాక్షాలతో ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని పొందండి.

Tags: