Navaratri Brahmotsavams: నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
చేయాలి
Navaratri Brahmotsavams: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన టీటీడీ జేఈవో శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తయిన నేపథ్యంలో కేవలం 17 రోజుల వ్యవధిలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వివిధ విభాగాల పనితీరుపై సేకరించిన ఫీడ్‌బ్యాక్, చెక్‌లిస్ట్‌లను విభాగాల వారీగా సమీక్షించి, ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దడంతోపాటు మరింత మెరుగైన సమన్వయం కోసం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో అన్నప్రసాదం, విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణతోపాటు పలు విభాగాల్లో 95 నుంచి 98 శాతం వరకు సంతృప్తి వ్యక్తమైనట్లు తెలిపారు. ఇదే అనుభవంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పూర్తిస్థాయిలో సెలవులు ఉండటం వల్ల గత బ్రహ్మోత్సవాలతో పోలిస్తే మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల భక్తుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని అదనంగా సుమారు 20 శాతం భక్తుల రాకను అంచనా వేస్తూ అన్నప్రసాదం, అవసరమైన సామగ్రి, ప్రొక్యూర్‌మెంట్, స్టాకింగ్, రవాణా, లాజిస్టిక్స్ తదితర అంశాల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.