One Surya Namaskar a Day: రోజుకో సూర్య నమస్కారం..ఈ ఆసనాలతో అద్భుత మార్పులు ఇవే..

ఈ ఆసనాలతో అద్భుత మార్పులు ఇవే..

Update: 2026-05-19 03:25 GMT

One Surya Namaskar a Day: సూర్యుడు... ఈ సృష్టికి ప్రత్యక్ష దైవం. మనకు జీవాన్ని, చైతన్యాన్ని ప్రసాదించే శక్తి స్వరూపం. అలాంటి సూర్యుడికి మనం చేసే సూర్య నమస్కారాలు... కేవలం ఒంటికి ఇచ్చే వ్యాయామం మాత్రమే కాదు. అది మన శరీరాన్ని, మనస్సును ఆ సూర్య భగవానుని అనంత శక్తితో ముడిపెట్టే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడు అంటే అధికారం, చైతన్యం, ఆత్మవిశ్వాసం, ఇంకా జీవశక్తికి మూలం. అందుకే రోజూ సూర్య నమస్కారాలు చేస్తే ఈ గుణాలన్నీ మనలో పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

సూర్య నమస్కారాల్లో మొత్తం 12 ఆసనాలు ఉంటాయి. సాంప్రదాయం ప్రకారం.. ప్రతి ఆసనం సూర్యుడికి ఉన్న పన్నెండు విశిష్ట నామాలలో ఒకదానితో ముడిపడి ఉంటుంది. 'ఓం మిత్రాయ నమః' అంటూ మొదలై.. 'ఓం భాస్కరాయ నమః' వరకు సాగే ఈ మంత్రోచ్ఛారణతో, శ్వాసను అదుపులో ఉంచుకుంటూ, ఒక లయ ప్రకారం చేసే ఈ ఆసనాలు... మన శరీరంలోని ఏడు చక్రాలను లేదా శక్తి కేంద్రాలను అద్భుతంగా యాక్టివ్ చేస్తాయి. తద్వారా మనలో సకారాత్మక శక్తి ప్రవహిస్తుంది.

అయితే, సూర్య నమస్కారాల వల్ల కలిగే శారీరక ప్రయోజనాలు కూడా సామాన్యమైనవి కావు. తల నుండి కాలి వేళ్ల వరకు శరీరంలోని ప్రతి భాగానికి ఇది చక్కటి వ్యాయామాన్ని అందిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరచడమే కాకుండా, రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని సాధన చేయడం వల్ల జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది. అంతేకాదు, శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగి, శరీరం ఎంతో దృఢంగా, మృదువుగా తయారవుతుంది.

ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి మానసిక సమస్యలకు సూర్య నమస్కారాలు ఒక చక్కటి విరుగుడు. వీటిని క్రమం తప్పకుండా చేయడం వల్ల నరాల వ్యవస్థ శాంతించి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ముఖంలో ఒక వింతైన కాంతి, తేజస్సు సంతరించుకుంటాయి. చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేయదగ్గ ఒక పరిపూర్ణమైన వ్యాయామం ఈ సూర్య నమస్కారాలు.

Tags:    

Similar News