Pitru Paksha: హిందూ సంప్రదాయంలో పితృ పక్షానికి ఎంతో పవిత్రమైన, విశిష్టమైన స్థానం ఉంది. ఈ పక్షం రోజులలో తర్పణాలు, పిండ ప్రదానాల ద్వారా పూర్వీకులను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు వర్ధిల్లుతాయని ప్రగాఢ నమ్మకం. అయితే చాలామంది తెలియక పూర్వీకుల ఫోటోలను ఉంచే స్థలం విషయంలో, వాటి ముందు పెట్టే వస్తువుల విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాస్తు శాస్త్రం మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం, పూర్వీకుల చిత్రపటాల వద్ద కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించి కుటుంబంలో మనశ్శాంతి దెబ్బతినే ప్రమాదం ఉంది పూర్వీకుల ఫోటోల ముందు ఏ వస్తువులు పెట్టకూడదు, వాస్తు ప్రకారం వాటిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం..

పూర్వీకుల ఫోటోల వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచకూడని వస్తువులు..

పాదరక్షలు, మురికి దుస్తులు

పూర్వీకుల చిత్రపటాల సమీపంలో చెప్పులు, బూట్లు లేదా ఉతకని మురికి బట్టలను అస్సలు ఉంచకూడదు. పితృల ఫోటోల ముందు పాదరక్షలు పెట్టడం వారిని అవమానించినట్లుగా భావిస్తారు. ఆ ప్రాంతంలో అపరిశుభ్రత లేదా చెత్త పేరుకుపోతే పితృదేవతల అనుగ్రహం లభించదు. అందుకే ఆ ప్రదేశాన్ని నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి.

శబ్దం చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు

టీవీ, సౌండ్ స్పీకర్లు లేదా అధిక శబ్దం చేసే ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల ముందూ పూర్వీకుల ఫోటోలను పెట్టకూడదు. శబ్ద కాలుష్యం పితృల శాంతికి భంగం కలిగిస్తుందని విశ్వసిస్తారు. అలాగే అనవసరమైన విరిగిపోయిన పాత వస్తువులు, సౌందర్య సాధనాలు (కాస్మొటిక్స్) వంటి వాటిని వారి చిత్రపటాల ముందు పేర్చవద్దు.

పూజ గదిలో దేవుడి పటాలతో కలిపి పెట్టవద్దు

చాలా ఇళ్లలో చేసే సాధారణ తప్పు.. పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు లేదా ఫోటోల పక్కనే పూర్వీకుల ఫోటోలను ఉంచడం. శాస్త్రం ప్రకారం దైవానికి, పితృదేవతలకు వేర్వేరు స్థానాలు నిర్దేశించబడ్డాయి. పితృలు దేవుడితో సమానం కారు, దేవుడు పితృల కంటే భిన్నమైన శక్తి. కాబట్టి దేవుడి గదిలో కాకుండా గౌరవప్రదమైన మరో ప్రత్యేక స్థలంలో వారి ఫోటోలను ఉంచాలి.

జీవించి ఉన్న వ్యక్తుల ఫోటోలతో కలిపి పెట్టకూడదు

మరణించిన పూర్వీకుల చిత్రాల పక్కనే ఇంట్లో బతికి ఉన్న కుటుంబ సభ్యుల ఫోటోలను ఎప్పుడూ కలిపి ఉంచరాదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు మనశ్శాంతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాస్తు ప్రకారం పూర్వీకుల ఫోటోలను ఎక్కడ ఉంచాలి?

వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం, పూర్వీకుల చిత్రపటాలను ఉంచడానికి దక్షిణ దిశ అత్యంత అనుకూలమైనది. దక్షిణ దిక్కును యమధర్మరాజు మరియు పితృదేవతల స్థానంగా పరిగణిస్తారు. ఫోటోను దక్షిణం గోడకు తగిలించినప్పుడు, ఆ ఫోటో ముఖభాగం ఉత్తర దిశ వైపు చూస్తున్నట్లు ఉండాలి. ఇది ఇంటికి ఎంతో శుభప్రదం. ఇంట్లో కూడా ఒకవేళ పూర్వీకుల ఫోటోల వద్ద ఈ పొరపాట్లు జరిగి ఉంటే వెంటనే సరిదిద్దుకుని, పితృదేవతల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.

Tags: