Powerful Karmic Phase from July 27 to December 11: జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు అత్యంత శక్తివంతమైన కార్మిక్ ఫేజ్.. జ్యోతిష్య నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారో తెలుసా?

ఎందుకు హెచ్చరిస్తున్నారో తెలుసా?

Update: 2026-06-30 13:12 GMT

Powerful Karmic Phase from July 27 to December 11: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని 'కర్మ కారకుడు, క్రమశిక్షణ, న్యాయం మరియు జీవిత పాఠాలకు అధిపతిగా భావిస్తారు. అయితే ఈ ఏడాది (2026) జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు శని గ్రహం మీన రాశిలో వక్ర గమనం లోకి వెళ్లనుంది. సుమారు 137 రోజుల పాటు సాగే ఈ కాలం, మానవాళి అందరికీ అత్యంత కీలకమైన, శక్తివంతమైన కార్మిక్ ఫేజ్ అని జ్యోతిష్య నిపుణులు బలంగా నమ్ముతున్నారు. ఈ సమయంలో భూమికి అత్యంత దగ్గరగా వచ్చే శని దేవుడు.. మన గత కాలపు పనులు, బాధ్యతలు ఇంకా పూర్తికాని కర్మలను సమీక్షించుకునేలా చేస్తాడని నిపుణులు చెబుతున్నారు.

ఈ కార్మిక్ ఫేజ్ ప్రత్యేకత ఏంటి?

జ్యోతిష్యం ప్రకారం, శని గ్రహం వెనక్కి నడుస్తున్నట్లు కనిపించినప్పుడు, దాని శక్తి అంతర్ముఖంగా మారుతుంది. ఇది సాధారణ మెర్క్యురీ రెట్రోగ్రేడ్ లాగా కేవలం కమ్యూనికేషన్ లోపాలు లేదా ప్రయాణ ఆలస్యాలకు పరిమితం కాదు. ఇది ఆత్మపరిశీలనకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించిన ఒక ఉన్నతమైన సమయం.

ఈ కాలంలో మరో విశేషం ఏంటంటే.. దేవగురువైన బృహస్పతి (గురుడు) కూడా కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ప్రయాణిస్తున్నాడు. శని వక్ర గమనం మరియు గురుడి ఉచ్ఛ స్థితి.. ఈ రెండూ కలిసి రావడం వల్ల ఇది ఒక అరుదైన మరియు పవిత్రమైన కార్మిక్ విండోగా మారుతోంది.

ఈ కాలంలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

గతంలోని సమస్యలు మళ్లీ ఎదురవ్వడం:

మీరు గతంలో పరిష్కరించకుండా వదిలేసిన సమస్యలు, బాధ్యతలు లేదా సంబంధాలు ఈ సమయంలో మళ్లీ మీ ముందుకు వస్తాయి. వాటిని పారిపోకుండా, బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

నిజమైన బంధాలు నిలబడతాయి:

మీ జీవితంలో ఉన్న నకిలీ బంధాలు, కృత్రిమమైన అటాచ్‌మెంట్లు ఈ కాలంలో సహజంగానే దూరమవుతాయి. కేవలం నిజాయితీ గల సంబంధాలు మాత్రమే ఈ పరీక్షను తట్టుకుని నిలబడతాయి.

ఆధ్యాత్మికత వైపు అడుగులు:

భగవద్గీతలోని ప్రధాన సూత్రమైన "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన" అనేదానికి ఈ సమయం అద్దం పడుతుంది. ప్రజలలో ఆధ్యాత్మిక చింతన, మెడిటేషన్, యోగా పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కెరీర్ ఆర్థిక విషయాల్లో ఆలస్యం:

శని ప్రభావం వల్ల వ్యాపారాలు, కెరీర్ నిర్ణయాలలో కొన్ని జాప్యాలు జరగవచ్చు. ఇది మిమ్మల్ని నిరాశ పరచడానికి కాదు, మీ నిర్ణయాలను మరింత జాగ్రత్తగా పునఃసమీక్షించుకోవడానికి ప్రకృతి ఇస్తున్న అవకాశం.

ఏ రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి?

ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నందున.. మేష రాశి మీన రాశి , కుంభ రాశి (ఏల్నాటి శని చివరి దశ) వారికి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహ రాశి (అష్టమ శని), ధనుస్సు రాశి (అర్థాష్టమ శని) వారు కూడా తమ ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

నిపుణులు సూచిస్తున్న పరిహారాలు:

శని దేవుడు శిక్షించేవాడు కాదు, మనల్ని సరైన మార్గంలో పెట్టే గొప్ప గురువు. ఈ కార్మిక్ ఫేజ్‌ను ప్రశాంతంగా దాటడానికి క్రింది పరిహారాలు సహాయపడతాయి.

సేవా కార్యక్రమాలు:

శనివారాల్లో పేదలకు, వృద్ధులకు అన్నదానం చేయడం, చెప్పులు లేదా మందులు కొనివ్వడం వల్ల కర్మల తీవ్రత తగ్గుతుంది.

దీపారాధన:

ప్రతి శనివారం శని దేవుని గుడిలో లేదా హనుమాన్, శివాలయాల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.

స్తోత్ర పఠనం:

రోజూ లేదా శనివారాల్లో దశరథ ప్రోక్త శని స్తోత్రం లేదా మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఆర్థిక జాగ్రత్తలు:

ఈ కాలంలో ఎవరికీ అప్పులు ఇవ్వడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ చేయకపోవడం ఉత్తమం.

Tags:    

Similar News