Srivari Prasadam: శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యత పర్యవేక్షణ మరింత బలోపేతం
బలోపేతం
Srivari Prasadam: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే దిశగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 13 మంది పోటు వర్కర్ సీనియర్లకు పోటు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించింది.
సింహ వాహనసేవ అనంతరం బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి పదోన్నతి ఉత్తర్వులను వారికి అందజేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా పోటు వర్కర్ సీనియర్లుగా విధులు నిర్వహిస్తున్న 13 మందికి పదోన్నతులు కల్పించాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పాలకమండలిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది.
ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన ఉద్యోగులు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న తమ పదోన్నతుల సమస్య పరిష్కారం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.