Rare Solar Eclipse in August: ఆగస్టులో అరుదైన సూర్యగ్రహణం.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?
ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?
Rare Solar Eclipse in August: ఖగోళ ప్రేమికులకు, అంతరిక్ష వింతలను ఆసక్తిగా గమనించే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం! ఈ శతాబ్దంలోనే అత్యంత అరుదైన, సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం ఆకాశంలో ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 90 నుంచి 93 శాతం వరకు సూర్యుడు కనపడకుండా చంద్రుని నీడ కమ్ముకోనున్న ఈ అద్భుత దృశ్యం ఎప్పుడు, ఎక్కడ ఏర్పడనుంది? దీనిని ఎలా వీక్షించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖగోళ శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం.. ఈ అరుదైన మహా సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించనుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణ మార్గం ఆర్కిటిక్ మహాసముద్రం మీదుగా ప్రారంభమై గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్ మీదుగా ఉత్తర స్పెయిన్, పోర్చుగల్ ప్రాంతాల వరకు కదులుతుంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్‌లోని జెనీవా, లౌసాన్, జ్యూరిచ్ వంటి నగరాల్లో సూర్యుడు దాదాపు 90 శాతానికి పైగా కప్పబడిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశ్చిమ ఐరోపా, వాయువ్య ఆఫ్రికా, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ఈ అద్భుతం పాక్షికంగా కనిపించనుంది.
అయితే, ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని మన భారతదేశం నుంచి నేరుగా చూసే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి! భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి సమయంలో సంభవిస్తుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో, ఈ 'అగ్నివలయం' లేదా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని భారతీయులు నేరుగా వీక్షించడం సాధ్యం కాదు. దీనివల్ల భారతదేశంపై ఎలాంటి గ్రహణ ప్రభావం లేదా సూతకాలం వర్తించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అయినప్పటికీ, టెక్నాలజీ సాయంతో నాసా (NASA) లాంటి ప్రముఖ అంతరిక్ష సంస్థల లైవ్ వెబ్‌సైట్లు లేదా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఈ అరుదైన ఖగోళ వింతను ప్రపంచం ఎక్కడి నుంచైనా వీక్షించవచ్చు.