Sabarimala Gold Crown Missing: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భారీ మోసం వెలుగుచూసింది. ఆలయ స్ట్రాంగ్‌రూమ్ నుంచి అయ్యప్ప స్వామికి భక్తులు సమర్పించిన అత్యంత విలువైన అసలైన బంగారు కిరీటం మాయమై, దాని స్థానంలో నకిలీ కిరీటాన్ని పెట్టినట్లు తనిఖీల్లో తేలింది. ఈ ఉదంతం భక్తులతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

విషయం ఎలా బయటపడింది?

శబరిమల ఆలయ పవిత్ర ఆభరణాల లెక్కలను సరిచూసేందుకు కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు నియమించిన అమికిస్ క్యూరీ జస్టిస్ కె.టి. శంకరన్ పర్యవేక్షణలో ఆడిట్ నిర్వహించారు. సన్నిధానంలోని భండారాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ భారీ వ్యత్యాసం బయటపడింది.

బరువులో భారీ వ్యత్యాసం ఉండటం, ఆభరణం తేలికగా ఉండటంతో ఇది అరిగిపోవడం వల్ల వచ్చిన తేడా కాదని, పక్కా ప్రణాళికతో అసలు కిరీటాన్ని మార్చేసి నకిలీదాన్ని తెచ్చిపెట్టారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కిరీటం నేపథ్యం ఏమిటి?

ఎవరు ఇచ్చారు?:

తమిళనాడుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ల బృందం 2012 ఆగస్టు 17న (చింగం మాస పూజల సమయంలో) ఈ బంగారు కిరీటాన్ని స్వామివారికి కానుకగా సమర్పించింది. తిరువాన్కూర్‌ దేవస్వం బోర్డు దీనికి సంబంధించిన అధికారిక రసీదు కూడా జారీ చేసింది. స్వామివారికి అలంకరించిన అనంతరం దీనిని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. నిబంధనల ప్రకారం విలువైన వస్తువులను కొద్దిరోజులు సన్నిధానంలో ఉంచి, అనంతరం అత్యంత భద్రత కలిగిన ఆరన్ములలోని సెంట్రల్ వాల్ట్‌కు తరలించాలి. కానీ, ఈ కిరీటాన్ని అక్కడికి తరలించకుండా సన్నిధానం భండారంలోనే ఏళ్ల తరబడి ఉంచేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

దొంగతనానికి దారితీసిన లోపాలు

సీసీటీవీ నిఘా లేకపోవడం సన్నిధానంలోని స్ట్రాంగ్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరాల నిఘా లేకపోవడం దుండగులకు కలిసివచ్చింది. ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ప్రతి ఏడాది మారుతుంటారు. దీంతో ఈ మార్పిడి ఎవరి హయాంలో, ఏ సమయంలో జరిగిందనేది గుర్తించడం దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారింది. ఆరన్ముల స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి కూడా బంగారు గొలుసు అదృశ్యమైనట్లు తనిఖీల్లో వెల్లడైంది.

ఈ ఘటనపై తిరువాన్కూర్‌ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ స్పందిస్తూ.. ఇది అత్యంత తీవ్రమైన అంశమని, భద్రతా వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేరళ హైకోర్టుకు త్వరలోనే పూర్తి నివేదిక సమర్పించనున్నారు.

Tags: