Sacred Significance of Coconut and Banana: పూజలో కొబ్బరికాయ, అరటిపండు ఎందుకు తప్పనిసరి? వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే..
వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే..
Sacred Significance of Coconut and Banana: హిందూ మతంలో ఏ చిన్న పూజ జరిగినా, పెద్ద శుభకార్యం జరిగినా కొబ్బరికాయ, అరటిపండు లేకుండా పూర్తి కాదు. అసలు దేవుడికి సమర్పించే అనేక రకాల పండ్లలో ఈ రెండింటికే ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇస్తారు? వీటిని పవిత్ర ఫలాలు అని ఎందుకు పిలుస్తారు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిజమైన నిర్మల ఫలాలు
మిగిలిన పండ్లతో పోలిస్తే కొబ్బరి, అరటిపండు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఇవి అపవిత్రమైన విత్తనాల నుండి పెరగవు. సాధారణంగా మామిడి, ఆపిల్ వంటి పండ్లను మనం తిని విత్తనాలను పారేస్తే, ఆ విత్తనాల నుండి కొత్త మొక్కలు వస్తాయి. అంటే అవి ఒకరి ఎంగిలి లేదా వ్యర్థాల ద్వారా మొలకెత్తుతాయి. కానీ, కొబ్బరికాయను గానీ, అరటిపండును గానీ మనం తిని పారేసిన వ్యర్థాల నుండి కొత్త మొక్కలు రావు. అరటి చెట్టును నాటాల్సిందే, అలాగే కొబ్బరిని విత్తనంగా వాడాల్సిందే. అందుకే ఇవి ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయని నమ్ముతారు.
ఆధ్యాత్మిక అర్థం: అహంకారానికి, త్యాగానికి ప్రతీకలు
అహంకారం: కొబ్బరికాయ పైన ఉండే గట్టి చిప్ప మనలోని అహంకారానికి చిహ్నం. దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం అంటే మన బాహ్య అహంకారాన్ని పగులగొట్టి, లోపల ఉండే స్వచ్ఛమైన మనసును భగవంతుడికి అర్పించడమని అర్థం. ఋగ్వేదం ప్రకారం కొబ్బరిని శ్రీఫలం అంటారు. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పండు. కొబ్బరికాయకు ఉండే మూడు కన్నులను ముక్కంటి అయిన శివుని రూపంగా భావిస్తారు.
త్యాగం: అరటి చెట్టు తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఫలాలను అందిస్తుంది. అది ఫలాలను ఇచ్చి చనిపోతూ తన మొదలు నుండి కొత్త చిగుళ్లను ఇస్తుంది. ఇది నిస్వార్థమైన త్యాగానికి చిహ్నం. అందుకే విష్ణుమూర్తికి అరటిపండును నైవేద్యంగా సమర్పించడం విశేష ఫలప్రదమని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.
వేదాల్లో ప్రస్తావన
అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో కూడా ఈ రెండు పండ్ల ప్రస్తావన ఉంది. ఇవి భారతదేశపు పురాతన పండ్లుగా గుర్తించబడ్డాయి. అందుకే శతాబ్దాలుగా మన సంప్రదాయంలో ఇవి విడదీయలేని భాగంగా మారిపోయాయి.
మనం భగవంతుడికి కొబ్బరికాయ, అరటిపండు సమర్పిస్తున్నామంటే.. మనలోని అహంకారాన్ని వదిలి, స్వచ్ఛమైన భక్తితో, త్యాగనిరతితో దైవప్రార్థన చేస్తున్నామని సంకేతం. తదుపరి సారి మీరు పూజలో వీటిని సమర్పించేటప్పుడు ఈ అంతరార్థాన్ని గుర్తుంచుకోండి.